మాపై స్మార్ట్ నిఘా పెట్టాయి

మాపై స్మార్ట్ నిఘా పెట్టాయి

ప్రపంచంలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ డివైస్ లను విరివిగా వాడుతున్నవారిలో భారతీయులు అగ్రస్థానంలో ఉంటారు. కానీ 52 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు తమ స్మార్ట్ డివైస్ లు తమకు తెలియకుండానే తమ వ్యక్తిగత సమాచారాన్ని రికార్డు చేస్తున్నాయని భావిస్తున్నారు. YouGov నిర్వహించిన సర్వేలో సగం మందికి పైగా భారతీయులు ఇదే మాట చెప్పారు. 

ఇంటర్నెట్ ఆధారిత మార్కెట్ రీసెర్చ్, డేటా అనలిటిక్స్ సంస్థ అయిన YouGov తన సర్వే గురించి పలు ఆశ్చర్యపరిచే వివరాలు వెల్లడించింది. సర్వ సాధారణంగా ఉపయోగించే డివైస్ లు కూడా తమను గమనిస్తున్నాయని చాలా మంది అభిప్రాయపడ్డారు. 'ఆన్ లైన్ ప్రైవసీ, ప్రైవేట్ సమాచారం (ఫోటోలు, మెయిల్స్, ఆర్థిక వివరాలు) కోల్పోతామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 55 శాతం మంది తాము ఇదే టెక్ సంబంధిత భయంలో ఉన్నట్టు చెప్పారు. సైబర్ టెర్రరిజమ్ తమ రెండో అతిపెద్ద భయం అని 53 శాతం మంది తెలిపారని' కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

85 శాతం మందికి స్మార్ట్ ఫోన్ ఉండగా వారిలో 54 శాతం మంది టెక్నాలజీ తమపై నిఘా పెట్టిందని భావిస్తున్నారు. సర్వే ప్రకారం టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నందువల్ల తాము సామాజికంగా ఒంటరులమవుతామని 34 శాతం మంది భయపడుతున్నారు. మరో 34 శాతం మంది మానవ పరస్పర చర్యలను కృత్రిమ మేధ ఆక్రమించనుందని అనుకుంటున్నారు. టెక్నాలజీపై అవసరానికి మించి ఆధారపడటం జరుగుతుందని 32 శాతం మంది భావిస్తున్నారు.