54,000 మడ అడవుల నరికివేత

54,000 మడ అడవుల నరికివేత

ముంబై-అహ్మదాబాద్ ల మధ్య నిర్మించబోతున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం మహారాష్ట్రలోని 13.36 హెక్టార్లలో విస్తరించి ఉన్న కనీసం 54,000 మడ అడవులను నరికివేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శాసన మండలిలో శివసేన ఎమ్మెల్సీ మనీషా కయాందే ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ రవాణా మంత్రి దివాకర్ రావ్తే, ప్రాజెక్టు కోసం నరికివేస్తున్న చెట్లకు ఐదు రెట్లు నాటనున్నట్టు తెలిపారు. 'మడ అడవులు, పర్యావరణానికి అతి తక్కువ నష్టం కలిగేలా ఈ ప్రాజెక్టును ఎత్తైన స్థంభాలపై నిర్మించనున్నాం. నవీ ముంబైలో వరదనీరు చొచ్చుకు రాకుండా ఆ ప్రాంతంలో మడ అడవులను నరకబోము' అని చెప్పారు. ప్రాజెక్టుతో ప్రభావితమయ్యే స్థానికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, వారికి తగిన నష్ట పరిహారం ఇస్తామని అన్నారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్సీ శరద్ రన్పీసే అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1,379 హెక్టార్ల భూమిని సేకరిస్తోందని వివరించారు. ఇందులో 275.65 హెక్టార్లు మహారాష్ట్రలోని వ్యక్తిగత భూములని తెలిపారు. ముంబైలోని విఖ్రోలీలో 39.252 చదరపు మీటర్ల ప్రైవేటు భూమిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. పాల్ఘర్ జిల్లాలో 188 హెక్టార్ల ప్రైవేటు భూమిని ప్రభుత్వం సేకరిస్తుందని, దీని కారణంగా 3,498 కుటుంబాలు ప్రభావితమవుతాయని అన్నారు. ఇందులో 2.95 హెక్టర్ల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. థానే జిల్లాలో 84.81 హెక్టార్ల భూమి కలిగిన 6.589 మంది రైతులు ప్రాజెక్ట్ కారణంగా ప్రభావితమవుతారు. 2.95 హెక్టార్ల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది.