వయసు 60 ఏళ్లు..ముఖంపై ఒక్క ముడుత లేదు

వయసు 60 ఏళ్లు..ముఖంపై ఒక్క ముడుత లేదు

ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలు ఎప్పుడూ ఇష్టపడే బొమ్మ ఏదైనా ఉందంటే అది బార్బీ డాల్. ఈ ఏడాది బార్బీ డాల్ కి 60 ఏళ్లు నిండుతున్నాయి. కానీ బార్బీ ముఖంలో ఆ వయసుకి వచ్చే ముడుతల్లేవు. అదే మాదిరిగా ఆమెకి ఉన్న క్రేజు రవ్వంతైనా తగ్గలేదు. దేశదేశాల్లో ఇంత ప్రఖ్యాతి పొందిన ఈ బొమ్మ కాలానికి తగ్గట్టు తన వేషం, అలంకరణ మార్చుకుంటూ ఎంతో పోటీ ఉండే ఆటబొమ్మల పరిశ్రమలో ఇంత సుదీర్ఘ కాలం మనగలిగింది. ఇప్పటికీ 150కి పైగా దేశాల్లో ఏటా 5 కోట్ల 80 లక్షలకు పైగా బార్బీ బొమ్మలు అమ్ముడవుతాయంటే ఆశ్చర్యం కలగక మానదు. 

‘ఏదైనా పరిశ్రమలో 3-5 ఏళ్ల వరకు విజయ పరంపర కొనసాగించవచ్చు. ముఖ్యంగా గట్టి పోటీ ఉండే ఆటబొమ్మల పరిశ్రమలో. అలాంటిది 60 ఏళ్లుగా కొనసాగడం అంటే మాటలు కాదని’ బార్బీ గ్లోబల్ బ్రాండ్ మార్కెటింగ్ డైరెక్టర్ నాథన్ బయనార్డ్ అన్నారు. ఇటీవల ఎల్ సెగుందోలోని మటెల్ డిజైన్ స్టూడియో పర్యటనకు వెళ్లిన బయనార్డ్, ప్రపంచవ్యాప్తంగా కోకాకోలా, మెక్డోనాల్డ్స్ మాదిరిగా బార్బీ కూడా ప్రసిద్ధి చెందిందని వివరించారు. 

9 మార్చి, 1959లో న్యూయార్క్ లో నిర్వహించిన అమెరికా బొమ్మల ప్రదర్శనలో మొదటిసారి దర్శనం ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా బార్బీ డాల్స్ అమ్ముడయ్యాయి. మటెల్ సహ వ్యవస్థాపకుడైన రూథ్ హ్యాండ్లర్ బార్బీ బొమ్మను రూపొందించాడు.