60 లేదా 35? యుపిలో బీజేపీకి వచ్చే సీట్లెన్ని??

60 లేదా 35? యుపిలో బీజేపీకి వచ్చే సీట్లెన్ని??

గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సునాయాసంగా అధికార పీఠం ఎక్కడానికి అవసరమైన సీట్లను లెక్కకు మిక్కిలిగా కట్టబెట్టింది ఉత్తరప్రదేశ్. కానీ ఈ ఎన్నికల్లో యుపిలో అధికార పార్టీ అలాంటి విజయం సాధించడం కష్టమేనంటున్నారు విశ్లేషకులు. రాబోయేది ఏ ప్రభుత్వం అని అంచనాలు, లెక్కలు వేస్తూ తలమునకలవుతున్నారు. కేంద్రంలో ఏ కూటమి అయినా అధికారం అందుకోవడంలో కనీసం నాలుగు ప్రాంతీయ పార్టీలు కింగ్ మేకర్ల పాత్ర పోషించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్నికల ముందు సర్వేల ఆధారంగా, ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే బీజేపీ విజయం సాధించవచ్చని భావిస్తున్నారు. అయితే ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయనే ఆలోచనే అందరినీ భయపెడుతోంది. 

గత ఎన్నికలతో పోలిస్తే 80 లోక్ సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో బీజేపీ బలం సగానికి తగ్గవచ్చని బ్రోకరేజ్ యాంబిట్ కేపిటల్ అంచనా వేస్తోంది. కమలం పార్టీకి సుమారుగా 30-35 సీట్లు రావచ్చని చెబుతోంది. అయితే ఇది కేవలం ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానేనని, అదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే ఎక్కువగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పైనని అంటున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ 190-220 స్థానాలు గెలుస్తుందని, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కలిపితే ఆ సంఖ్య 220-240కి చేరుకోనుందని చెబుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మిగిలిన స్థానాల కోసం కనీసం నాలుగు పెద్ద ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకోక తప్పదని స్పష్టం చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ లో కాషాయ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనే విషయంపై ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. చాలా మంది 20-60 స్థానాల మధ్య అని అంటున్నారు. అయితే అంతా మాత్రం ఎన్నికల తర్వాత చిత్రాన్ని ప్రాంతీయ పార్టీలే నిర్ణయించబోతున్నాయని గట్టిగా చెబుతున్నారు. 'ప్రస్తుత ఎన్డీఏలోని ప్రాంతీయ పార్టీలు ప్రస్తుతం ఉన్న 54 స్థానాల నుంచి 25-30 సీట్లకే పరిమితం కానున్నాయి. 2014 ఎన్నికల్లో  282 సీట్లు సాధించిన బీజేపీ 170-180 సీట్లు సాధించవచ్చు. కాంగ్రెస్ 140-150 వరకు స్థానాల్లో గెలుపొందవచ్చు. ఇది 2004లో యుపిఏ-1 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి సంఖ్యే' అని లెక్కలు వేస్తున్నారు. 

అయితే క్షేత్రస్థాయిలోని బీజేపీ కార్యకర్తలు మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, తమతో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ అభ్యర్థలు అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీని విమర్శిస్తున్నారు తప్ప బీఎస్పీని కాదని గుర్తు చేస్తున్నారు.