ఇండో అమెరికన్ బాలిక కోసం భారీగా విరాళాలు

ఇండో అమెరికన్ బాలిక కోసం భారీగా విరాళాలు

మతోన్మాదం మత్తులో తూగుతున్న ఓ వ్యక్తి ముస్లింలుగా భావించి ఓ కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి.. కోమాలోకి వెళ్లిన ఓ చిన్నారి జీవితం కొనవూపిరితో కొట్టుమిట్టాడుతోంది. చిన్నారి కోలుకోవడం కోసం ప్రపంచమంతా ప్రార్ధిస్తుంది. ఆమెను కాపాడేందుకు దాతలు ముందుకొస్తున్నారు. బాలిక చికిత్స కోసం ఇప్పటివరకు 6లక్షల డాలర్లకు పైగా విరాళాలు అందించారు. వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాలోని సన్నీవాలేకు చెందిన 13ఏళ్ల భారత అమెరికన్‌ ధృతి నారాయణ్‌.. గత నెల 23న తన కుటుంబసభ్యులతో కలిసి బయటకు వెళ్లింది. వారంతా రోడ్డుపై నడుస్తుండగా ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తన కారుతో పాదచారులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ధృతి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.  తలకు బలమైన గాయమవడంతో ధృతి ప్రస్తుతం కోమాలో ఉంది. 

ఆమెకు వైద్యం చేయడానికి 5 లక్షల అమెరికన్‌ డాలర్లు(రూ.3,46,80,750) ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. ఇంత భారీ మొత్తం ఖర్చు చేసి ధ్రితికి వైద్యం చేపించే స్థితిలో ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితులు లేవు. ధృతి చికిత్స కోసం భారీగా ఖర్చవుతుండటంతో ఆమె కుటుంసభ్యులు గోఫండ్‌మీ అనే స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. దీంతో ఆ సంస్థ ఆమె పేరుపై ఓ పేజీ రూపొందించి విరాళాలు సేకరించడం ప్రారంభించింది. ధృతిని కాపాడేందుకు అనేకమంది ముందుకొచ్చారు. వారం రోజుల్లోనే 12వేల మందికి పైగా దాతలు 6లక్షల డాలర్ల విరాళాలు అందించారు. సన్నీవాలే ఘటనను స్థానిక పోలీసులు జాతి విద్వేష దాడిగా ధ్రువీకరించారు. ఇసాయ్‌ పీపుల్స్‌ అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. గతంలో ఇరాక్‌ సైన్యంలో పనిచేసిన ఇసాయ్‌ ముస్లింలపై ద్వేషం పెంచుకున్నాడు. ఘటన జరిగిన సమయంలో అక్కడున్న వారంతా ముస్లింలని భావించి వారిపై ఉద్దేశపూర్వకంగానే కారుతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.