ఆరో విడతలో రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం ఇలా..

ఆరో విడతలో రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం ఇలా..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడత లోక్‌సభ ఎన్నికలు కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిశాయి. 7రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ నిర్వహించగా... మొత్తంగా 63.48 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే ఢిల్లీలో 59.74 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 54.72 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 80.35 శాతం, జార్ఖండ్‌లో 64.5 శాతం, బీహార్‌లో 59.29 శాతం, మధ్యప్రదేశ్‌లో 64.55 శాతం, హర్యానా 68.17 శాతం నమోదైంది. ఇక బీజేపీ నుంచి మేనకా గాంధీ, వరుణ్‌ గాంధీ, రీటా బహుగుణ జోషి, దిలీప్‌ ఘోష్‌, మీనాక్షి లేఖి, గౌతమ్‌ గంభీర్, కాంగ్రెస్‌ నుంచి దిగ్విజయ్‌ సింగ్‌, జ్యోతిరాదిత్య సింధియా, షీలా దీక్షిత్‌, ఎస్పీ నుంచి అఖిలేష్‌ యాదవ్ తదితర ప్రముఖులు ఆరో విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

ఆరో విడత పోలింగ్ సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా, తమ్లుక్‌ నియోజకవర్గాల్లో ఈవీఎంలు దెబ్బతిన్నాయని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్‌లోని ఘటల్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి భారతీ ఘోష్‌పై తృణమూల్‌ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. రెండు ప్రాంతాలకు ఆమెకు చేదు అనుభవం ఎదరవ్వగా.. కన్నీరు పెట్టుకున్నారామె. యూపీలోని ఫూల్పూర్‌లో ఎస్పీ, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. ఇక 59 స్థానాల్లో బరిలో 979 మంది అభ్యర్థులు తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈవీఎంల్లో వారి భవితవ్యం నిక్షిప్తమైంది.