"ఇంకా 80 రోజులు": వరల్డ్ కప్ 2019కి విరాట్ కోహ్లీ కసరత్తులు

"ఇంకా 80 రోజులు": వరల్డ్ కప్ 2019కి విరాట్ కోహ్లీ కసరత్తులు

ఇటీవల ఐసీసీ వరల్డ్ కప్ 2019కి ముందు చివరగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా 2-3తో ఓడిపోయింది. ఇంగ్లాండ్ లో మే 30 నుంచి క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ లో తనదైన ముద్ర వేయాలని భారత జట్టు కెప్టెన్ ఉరకలేస్తున్నాడు. వరల్డ్ కప్ సన్నాహాలు ప్రారంభించినట్టు చెబుతూ తన కసరత్తుల వీడియోని విరాట్ పోస్ట్ చేశాడు. తన ట్విట్టర్ హ్యాండిల్ లో '80 డేస్ టు గో (ఇంకా 80 రోజులు)' అని రాసి వరల్డ్ కప్ 2019లో భారత్ ఆరంభ మ్యాచ్ కి కౌంట్ డౌన్ ప్రారంభించాడు.

వరల్డ్ కప్ లో జూన్ 5న సౌథాంప్టన్ లోని ద రోజ్ బౌల్ లో దక్షిణాఫ్రికాతో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. 

 

గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ నిర్ణయాక మ్యాచ్ లో 35 పరుగులతో ఓడిపోవడంపై వ్యాఖ్యానిస్తూ టీమిండియా కెప్టెన్ వరల్డ్‌ కప్ టైటిల్ రేస్ లో ఏ జట్టుని కూడా ఫేవరెట్స్ గా చెప్పలేమని, అన్ని టీమ్ లకు సమాన అవకాశాలు ఉన్నాయన్నాడు విరాట్. 'వరల్డ్ కప్ లో ప్రతి జట్టు ప్రమాదకరమైనదే. ప్రపంచ కప్ లో ఊపందుకున్న ఏ జట్టునైనా అడ్డుకోవడం చాలా చాలా కష్టమని' చెప్పాడు. 'అలాగే ఊపులో ఉన్న ఏ జట్టయినా సెమీస్ లో నాకౌట్ కావచ్చు. ఆ రోజు ధైర్యంగా తమదైన శైలిలో స్వేచ్ఛగా ఆడిన జట్టు వారిని చిత్తు చేయవచ్చు' అని అభిప్రాయపడ్డాడు. 

'వరల్డ్ కప్ లో ఏ జట్టు కూడా ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతుందని అనుకోను. ఏ జట్టయినా ప్రమాదకారే. వెస్టిండీస్ ఎలా ఆడుతోందో చూడండి. వాళ్లు జట్టులో సమతూకం సాధించిన తీరు చూస్తుంటే వరల్డ్ కప్ లో వాళ్లు తీవ్ర ప్రమాదకారులు కావచ్చు' అని చెప్పాడు. 'ఇంగ్లాండ్ చాలా బలమైన జట్టు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా సమతౌల్యంగా కనిపిస్తోంది. మేం కూడా బలమైన టీమే. న్యూజిలాండ్ మంచి జట్టు, వారిదైన రోజున పాకిస్థాన్ ఎవరినైనా చిత్తు చేయగలదు' అని కోహ్లీ వివరించాడు.

భారత్ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో చివరిసారిగా 2011 వరల్డ్ కప్ గెలిచింది. ఈ సారి తన నాయకత్వ అనుభవంతో కెప్టెన్ విరాట్ కోహ్లీకి మార్గదర్శనం చేయనున్నాడు.