800 యూనివర్సిటీలు.. 10 వేల ఫ్రీ కోర్సులు

800 యూనివర్సిటీలు.. 10 వేల ఫ్రీ కోర్సులు

చదువు, విజ్ఞాన సముపార్జనం అనేది ఇటీవలి కాలం వరకు బాగా ఖరీదైన వ్యవహారం. అయితే ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయి, ప్రపంచమే ఓ చిన్న పల్లెటూరుగా మారిపోయిన క్రమంలో విజ్ఞానం పెంచుకునే కోర్సులు ఇప్పుడు చాలా అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. కొన్ని కోర్సులైతే ఆన్ లైన్లో ఉచితంగానే అందిస్తున్నారు. 

అమెరికాలోని మసాచుసెట్స్, హార్వర్డ్ యూనివర్సిటీలు.. ఉచిత ఆన్ లైన్ కోర్సుల్ని ప్రవేశపెట్టి ఔత్సాహికుల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. రొటీన్ వర్క్ నుంచి మనసును మళ్లించి ఆహ్లాదం అందించే కాలక్షేపం కోర్సుల నుంచి తక్కువ టైమ్ లో విజ్ఞాన సముపార్జన చేసుకునే సైన్స్ అంశాల వరకు అనేక కోర్సులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటిని మాసివ్ ఓపెన్ ఆన్ లైన్ కోర్సెస్ (ఎంఓఓసీ) గా పిలుస్తున్నారు. జాజ్, పియానో, కోర్డ్ వంటి సంగీతవాద్య పరికరాలపై ఫ్రీగా ఆన్ లైన్ కోర్సులు నిర్వహిస్తున్నారు. బోస్టన్లోని బర్కిలీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్... గిటార్ వాద్యంలో 4 వారాల ఉచిత కోచింగ్ ను అందిస్తోంది. 

వాతావరణ అధ్యయనంలో హార్వార్డ్ యూనివర్సిటీ, విశ్వ గమనాన్ని అర్థం చేసుకోవడం, రోబోలతో మంచా చెడా అనే కోర్సును నెదర్లాండ్స్ లోని డెల్ఫిట్ యూనివర్సిటీ ఉచితంగా అందిస్తున్నాయి. 2012లోనే ఇలాంటి ఫ్రీ ఆన్ లైన్ కోర్సులకు ప్రాధాన్యత లభించేలా.. ద ఇయర్ ఆఫ్ ఎంఓఓసీ గా ఆ సంవత్సరాన్ని ప్రకటించారు. అయితే అప్పట్నుంచి 
ఈ ఏడేళ్లలోనే 800 యూనివర్సిటీలు దాదాపు 10 వేల కోర్సుల్ని డిజైన్ చేసి... కొన్నింటిని ఉచితంగా, మరికొన్ని కోర్సుల్ని పాక్షిక ఫీజులతో అందుబాటులోకి తెచ్చాయి. ఔత్సాహికులు ఎవరైనా కొత్త విషయాన్ని ఇక చాలా సులభంగా నేర్చుకోవచ్చు.