పెద్దనోట్ల రద్దు ఏడాది ఐటీ రిటర్న్ లు దాఖలు చేయనివారు 88 లక్షలు

పెద్దనోట్ల రద్దు ఏడాది ఐటీ రిటర్న్ లు దాఖలు చేయనివారు 88 లక్షలు

పెద్దనోట్ల రద్దు ప్రయోగం విజయవంతమైందని ప్రభుత్వం ప్రకటించుకొంది. ఆర్థిక సంవత్సరం 2016-17లో 1.06 కోట్ల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు వచ్చారని చెప్పింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 25 శాతం ఎక్కువయ్యారని చంకలు గుద్దుకొంది. ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం పెద్దనోట్ల రద్దు సంవత్సరం అంటే 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను రిటర్న్ లు దాఖలు చేయనివారి సంఖ్య 2015-16తో పోలిస్తే 8.56 లక్షల నుంచి 10 రెట్లు పెరిగి 88.04 లక్షలైంది. 2000-01 ఆర్ధిక సంవత్సరం తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఐటీ రిటర్న్ లు వేయకపోవడం రెండు దశాబ్దాలలో ఇదేనని పన్ను అధికారులు చెబుతున్నారు.

ఆర్థిక సంవత్సరం 2013లో రిటర్న్ లు ఫైల్ చేయని వారి సంఖ్య 37.54 లక్షల నుంచి తగ్గి ఆర్థిక సంవత్సరం 2014లో 27.02 లక్షలు, 2015లో 16.32 లక్షలు, 2016లో 8.56 లక్షలుగా ఉంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోయి ఉద్యోగాల్లో కొరత లేదా ఆదాయంలో తగ్గుదల కారణంగా ఐటీ రిటర్న్ లు ఫైల్ చేయనివారి సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు అంటున్నారు.