కొత్త ఎంపీలు 88 శాతం మంది కోటీశ్వరులే..

కొత్త ఎంపీలు 88 శాతం మంది కోటీశ్వరులే..

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి.. గతంలో కంటే ఎక్కువ సీట్లలో ప్రభంజనం సృష్టించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ నెల 30వ తేదీన భారత ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయడానికి నరేంద్ర మోడీ సిద్ధమయ్యారు. ఇక 17వ లోక్‌సభకు ఎన్నికైక కొత్త ఎంపీల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ. ఈ సారి ఎన్నికల్లో గెలిచిన 542 మంది లోక్‌సభ సభ్యుల్లో 475 మంది అంటే 88 శాతం మంది కోటీశ్వరులేనని తేల్చింది. ఈ జాబితాలో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ రూ. 660 కోట్ల ఆస్తులతో జాబితాలో టాప్‌స్పాట్‌లో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి గెలిచిన 303 మంది ఎంపీల్లో 265 మంది కోటీశ్వరులే.. కాంగ్రెస్ నుంచి గెలిచిన 51 మందిలో 43 మంది ఎంపీలు కోటీశ్వరులు కాగా.. శివసేన పార్టీ నుంచి గెలుపొందిన 18 మంది ఎంపీలంతే కోటేశ్వరులే కావడం విశేషం. డీఎంకే నుంచి 22 మంది, టీఎంసీ నుంచి 20 మంది, వైసీపీ నుంచి 19 మంది ఎంపీలు కోటేశ్వరులేనని వెల్లడించింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ .