స్కూల్‌కు వెళ్లమన్నారని ఆత్మహత్య..!

స్కూల్‌కు వెళ్లమన్నారని ఆత్మహత్య..!

చిన్న విషయానికి కూడా ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది... విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి స్కూల్‌ వెళ్లాలని తండ్రి చెప్పినందుకు.. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఈ ఘటన జిల్లాలోని నందవరం మండలం టి.సోమలగూడూరు గ్రామంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన యమన్న, లక్ష్మీ దంపతుల కుమారుడు గత కొన్ని రోజులుగా  అంజి(11) ప్రభుత్వ పాఠశాలకు వెళ్లకుండా  తిరుగుతూ ఉన్నాడని తండ్రి మందలించటంతో మనస్తాపానికి గురై తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకే కుమారుడు కావడంతో తల్లి తండ్రులు రోధిస్తున్న తీరు పలువురిని కన్నీరు పెట్టించింది.