భార్యను చంపిన 91 ఏళ్ల వృద్ధుడు

భార్యను చంపిన 91 ఏళ్ల వృద్ధుడు

కేరళలోని త్రిస్సూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఒకరికి ఒకరు తోడుగా ఉండాల్సిన వయస్సులో వారి మధ్య నిత్యం జరుగుతున్న గొడవలు హత్యకు దారితీసింది. త్రిసూరు జిల్లా వెల్లిక్కులాంగర నివాసం ఉంటున్న 91 ఏళ్ల వృద్ధుడు 87 ఏళ్ల తన భార్యను కిరాతకంగా చంపేశాడు. అంతేకాదు శవాన్ని తగులబెట్టి ఇంటి వెనకాల గోతిలో పాతిపెట్టాడు. చివరికి పోలీసుల దర్యాప్తులో హత్య చేశాడని తేలడంతో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

వెల్లిక్కులాంగర పోలీసు స్టేషన్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. చెరియకుట్టి అనే వృద్ధుడు ఆయన భార్య ఇద్దరు ఒంటరిగా జీవిస్తున్నారు. ఏడుగురు సంతానం ఉన్నప్పటికి వారికి దూరంగా ఉంటున్నారు. నిత్యం వృద్ధ దంపతులు గొడవలు పడుతుండేవారు. గత కొన్నిరోజులుగా మా అమ్మ కనిపించడం లేదంటూ ఆగస్టు 27న వారి చిన్న కుమారుడు జాబీ పోలీసులకు పిర్యాదు చేశాడు. అలాగే చెరియకుట్టి కూడా తన భార్య కనిపించడంలేదని పోలీసులకు తెలిపాడు. ఆటోలో బయటికి వెళ్లిన తన భార్య తిరిగి ఇంటికి రాలేదని ఫిర్యాదు చేశాడు. 

అనంతరం పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో మొదటి నుంచి ఆమె భర్త అయిన చెరియకుట్టిపైనే పోలీసులకు అనుమానం ఉంది. దీంతో ఇంట్లో సోదాలు జరుపగా గదిలో రక్తపు మరకలు, చేతి కర్రకు అంటిన రక్తాన్ని గమనించారు. వెంటనే ఆ వృద్దున్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య తానే చేసినట్లు అంగీకరించాడు. 

అగస్టు 27వ తేది సాయంత్రం ఇద్దరి మధ్య జరిగిన గొడవలో తనని బలంగా నెట్టేశానని, దీంతో ఆమె కింద పడిపోయిందని తెలిపాడు. ఈ గొడవలో తలకు గోడ తగలడంతో రక్తం వచ్చిందని అన్నాడు. అనంతరం తన చేతి కర్రతో బలంగా కొట్టానని, ఆ తరువాత గొంతుకు తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేయడంతో చనిపోయిందని పోలీసులకు వివరించాడు. అనంతరం శవాన్ని ఇంటి వెనకాల గోతిలో పాతిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలం రేపింది. పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన ఆ జంట మధ్య చెలరేగిన మనస్పర్ధలు, గొడవల కారణంగా ఒకరు ప్రాణాలు కొల్పోవాల్సి వచ్చింది.