ఏ నేరం చేయకుండానే 93 ఏళ్ల వృద్ధురాలి అరెస్ట్

ఏ నేరం చేయకుండానే 93 ఏళ్ల వృద్ధురాలి అరెస్ట్

కాటికి కాళ్లు చాపుకున్న వృద్ధుల చివరి కోరికలు వింతగా ఉంటాయి. చాలా మందికి కన్ను మూసేలోగా మనవలు, మనవరాళ్లని ఎత్తుకోవాలని అనుకుంటారు. మరికొందరు మనవల పెళ్లిళ్లు చూడాలన్న కోరిక వ్యక్తం చేస్తారు. మరికాస్త ముందుకెళ్లే ఇంకొందరు ఆ మనవల పిల్లలను చూసి సంతృప్తిగా తుది శ్వాస విడవాలనుకుంటారు. కానీ బ్రిటన్ కి చెందిన 93 ఏళ్ల జోసీ బర్డ్స్ వీళ్లందరికీ కొంచెం ప్రత్యేకం. ఆమె నలుగురితో నారాయణ అన్నట్టు కాకుండా ఎప్పుడూ వేర్వేరు కోరికలు కోరుతుంది.

జోసీ చనిపోవడానికి ముందు జీవితంలో ఒక్కసారి.. ఒకే ఒక్కసారి అరెస్ట్ కావాలని కోరుకుంది. అవును. నిజమే.. మీరు సరిగ్గానే చదివారు. చివరి శ్వాస విడవడానికి ముందు గ్రామ్ ఒక్కసారి అరెస్టయి జైలు కెళ్లాలని బలంగా కోరుకుంది. దీంతో ఆ బామ్మగారిని ఏ నేరం చేయకుండానే అరెస్ట్ చేశారు. ఆమె మనవరాలి విజ్ఞప్తి మేరకు యుకెలోనే అతిపెద్ద పోలీస్ బలగం.. ది గ్రేట్ మాంచెస్టర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

బామ్మగారిని అరెస్ట్ చేసినందుకు పామ్ స్మిత్ అనే ఆ మనవరాలు, ట్విట్టర్ లో పోలీసులకు థ్యాంక్స్ చెప్పింది. తన బామ్మ ఆరోగ్యం క్షీణిస్తోందని, జీవితంలో మరపురాని అనుభూతితో మరణించాలని బలంగా కోరుకుంటున్నందువల్ల ఇలా చేశానని స్మిత్ వివరించింది. తనను అరెస్ట్ చేయడంపై జోసీ చాలా సంతోష పడింది.