ఎండల్లో 'బీర్ల' జోరు...

ఎండల్లో 'బీర్ల' జోరు...

మండుటెండల్లో మందుబాబులు బీర్లతో ఉపశమనం పొందుతున్నారు. బీర్లు తెగ తాగేస్తున్నారు. మండే ఎండలకు ఇదే ఔషధమని నమ్ముతున్నట్టున్నారు. అందుకే సమ్మర్‌లో బీర్ల సేల్స్ అదిరిపోతున్నాయి. బాటిళ్లకు బాటిళ్లు... కేసులకు కేసులు ఖాళీ అయిపోతున్నాయి. 2018 తొలిత్రైమాసికంలోని తొలిమాసమైన ఏప్రిల్‌ లోనే బీర్ల అమ్మకాలు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ ఒక్క నెలలోనే సుమారు రూ.1200 కోట్ల మద్యం విక్రయాలు నమోదయ్యాయి. లాభదాయశాఖల్లో ఎక్సైజ్ శాఖే టాప్ ప్లేస్‌లో ఉంది. 

ఏప్రిల్, మే నెలల్లో ఎండలు దంచికొడతాయి... దీంతో బీర్ అమ్మకాలు భారీగా పెరుగుతాయి. ఈ సీజన్‌లో ఇది మరింత పెరిగినట్టు కనిపిస్తోంది. ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంతగా 40 లక్షలకు పైగా బీర్ కేస్‌లను అమ్మేశారు. ఒక్కో రోజు సుమారు 18 లక్షల బీర్ సీసాలు అమ్ముడయ్యాయంటూ సేల్స్ ఏ రేంజ్‌లో సాగాయో తెలుసుకోవచ్చు. ఈ ఒక్క నెలలోనే సుమారు రూ.780 కోట్ల మద్యం... రూ.400 కోట్ల బీర్ల అమ్మకాలు సాగించారు. హైదరాబాద్‌ జిల్లాలో సుమారు రూ.150 కోట్లు... రంగారెడ్డి జిల్లాలో రూ.140 కోట్లు, మేడ్చల్‌లో రూ.110 కోట్లు, మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.100 కోట్ల విక్రయాలతో టాప్ లేపాయి. ఇన్నాళ్లూ లిక్కర్‌ సేవించిన వారు కాస్తా రూటు మార్చి బీర్లే లాగిస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి... దీంతో ఒక్కసారిగా బీర్ల అమ్మకాలు భారీగా పెరిగిపోతున్నాయి.