మహేశ్ నుంచి చెర్రీని కాపాడతాడా..?

మహేశ్ నుంచి చెర్రీని కాపాడతాడా..?

రికార్డులు ఉన్నది బద్ధలు కొట్టడానికేనని పెద్దలు చెప్పిన మాట నిజమేనని అనిపిస్తుంది. సరిగ్గా నెల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుకుమార్-చరణ్‌ల రంగస్థలం మంచి పాజిటివ్ టాక్‌తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ చెర్రీ సత్తా చాటాడు.. కెరీర్‌లో తొలిసారిగా మూడున్నర మిలియన్ల వసూళ్లతో నాన్‌బాహుబలి సినిమాల్లో నెంబర్‌వన్‌గా నిలిచింది రంగస్థలం. మధ్యలో మరో సినిమా లేకపోతే ఈ మూవీ ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందోనని అనుకున్నారు. కానీ కొద్దిరోజుల తేడాతో సూపర్‌స్టార్ రంగప్రవేశం చేయడంతో సీన్ మొత్తం మారిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను రికార్డుల దుమ్ము దులుపుతోంది. తన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే నన్ను ఎవరూ ఆపలేరని మహేశ్ ప్రూవ్ చేసుకున్నాడు.

ముఖ్యంగా ఓవర్సీస్‌కి తానే బాద్‌షా అని చాటి చెప్పాడు.. సినిమా రిలీజైన వారం గ్యాప్‌లోనే ఏకంగా 3 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ఎంటరయ్యాడు. తద్వారా బాహుబలి-1 తర్వాత అతి తక్కువ రోజుల్లో 30 లక్షల డాలర్లు సంపాదించిన సినిమాగా భరత్ అనే నేనుని నిలబెట్టాడు. ప్రజంట్ ఈ సినిమా వసూళ్ల పరంగా అమెరికాలో టాప్-5 టాలీవుడ్‌ చిత్రాల్లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ ఊపులో తన రికార్డును కూడా మిగల్చడని చెర్రీతో పాటు అతని అభిమానులు డిసైడ్ అయిపోయారట. అయితే నాన్-బాహుబలి రికార్డుల్లో నెంబర్‌వన్‌గా ఉన్న రంగస్థలాన్ని క్రాస్ చేయడం అంత సులభంకాదనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాబోయే వీక్‌లో అమెరికాలో 5 రోజులు పనిదినాలు.. వీకెండ్‌లో బన్నీ నటించిన నా పేరు సూర్య రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమాను ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.. సో.. భరత్‌కు థియేటర్లను కుదించేస్తారు. మధ్యలో రంగస్థలానికి ఎలాగూ షోలు రన్ అవుతాయి కాబట్టి.. రంగస్థలాన్ని భరత్ అధిగమించడం అసాధ్యమే అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఒకవేళ నా పేరు సూర్య మధ్యలోకి రాకపోయుంటే మాత్రం భరత్‌ సునామీని తట్టుకోవడం కష్టమేనన్నది ట్రేడ్ పండితుల మాట. సో.. మొత్తానికి చరణ్‌ రికార్డుని బన్నీ చెక్కు చెదరకుండా ఉండేందుకు సాయపడ్డాడని ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు.