ధర్మపోరాటంలో అంతిమ విజయం మనదే...

ధర్మపోరాటంలో అంతిమ విజయం మనదే...

ధర్మపోరాటంలో అంతిమ విజయం మనదే అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... తిరుపతిలో నిర్వహించిన ధర్మపోరాట సభలో ఆయన మాట్లాడుతూ... నాలుగేళ్ల క్రితం వెంకన్నసాక్షిగా నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను గుర్తు చేయడానికే ఈ సభ అన్నారు. వెంకన్నసాక్షిగా మాట ఇచ్చి తప్పితే ఎవరికీ మంచిది కాదన్న చంద్రబాబు... ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయమే తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రప్రయోజనాల కోసమే ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్న ఏపీ సీఎం... హామీల అమలు కోసం అన్ని ప్రయత్నాలు చేసి, తాను పుట్టిన రోజున ధర్మ పోరాటానికి నాంది పలికామన్నారు. 

విభజన హామీలకే దిక్కులేకుంటే ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు... నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం కొనసాగిస్తామన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రం ఊసే ఎత్తలేదని... అన్యాయం జరిగిందని, పార్లమెంట్‌లో మన ఎంపీలు పెద్ద ఎత్తున పోరాడారన్నారు. హామీల అమలు కోసం నిలదీసినా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనంలేదని చంద్రబాబు... కేంద్రమంత్రులు రాజీనామా చేసినా స్పందించలేదని, దాంతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక ఆ రోజే అవిశ్వాస తీర్మానం కూడా పెట్టామని... రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్రలు కూడా నిర్వహించామని... ఈ ధర్మపోరాటం కొనసాగుతుందని... చివరకు మనే విజయం సాధిస్తామన్నారు చంద్రబాబు.