లీటర్‌ పెట్రోల్‌ రూ. 320!

 లీటర్‌ పెట్రోల్‌ రూ. 320!

రానున్న కొన్నేళ్ళలో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బ్యారెల్‌ ముడి చమురు ధరలు 75 డాలర్లు ఉండగా... రానున్న కొన్నేళ్ళలో 300 డాలర్లకు చేరడం అసాధ్యమేమీ కాదని చమురు రంగానికి చెందిన ప్రముఖ హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్‌ పైరే ఆండూర్యాండ్‌ అంచనా వేస్తున్నారు. ఆండూర్యాండ్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీని  నిర్వహిస్తున్న ఈయనను చమురు మార్కెట్‌ బుల్‌గా పేర్కొంటారు. దీనికి ఆయన చెప్పే ప్రధాన కారణం... ప్రస్తుతం ఈ రంగంలో పెద్దగా పెట్టుబడులు రాకపోవడం. మున్ముందు ఎలక్ర్టిక్‌ వాహనాలు వచ్చేస్తాయని అనే అంచనా చాలా కంపెనీలు చమురు రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపడం లేదు. దీంతో మున్ముందు ఆకస్మికంగా డిమాండ్‌ పెరుగుతుందని, కాని అందుకు తగ్గ సరఫరా మాత్రం ఉండదని ఆండూర్యాండ్‌ ట్వీట్‌ చేశారు.  ఎలక్ర్టిక్‌ వాహనాల వచ్చినా డిమాండ్‌ తగ్గకపోవచ్చనేది ఆయన అంచనా. చమురు ధరలు పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యనించారు. దీన్ని ప్రస్తావిస్తూ...ప్రస్తుతం వంద డాలర్లు ఉన్న చమురు ధరల వల్ల ఆర్థికవ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆండూరాండ్‌ అంటున్నారు. వాస్తవానికి ముడి చమురు ధరలు వంద డాలర్లకు పైన ఉంటేనే ఈ రంగంలోకి తాజా పెట్టుబడులు వస్తాయని ఆయన అంచనా వస్తున్నారు. 2008లో బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు 150 డాలర్లకు చేరిన విషయం తెలిసిందే.
మన మార్కెట్‌లో....
ఆండూర్యాండ్‌ అంచనా ప్రకారం చమురు ధరలు 300 డాలర్లకు చేరితే...అలాగే మన కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు తగ్గించకుంటే... జనం లీటర్‌ పెట్రోల్‌కు రూ. 320 చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇపుడు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ ధర 75 డాలర్లు.  ఈధర 300 డాలర్లకు చేరితే... మనం  లీటర్‌ పెట్రోల్ కు చెల్లించాల్సిన మొత్తం రూ. 80 నుంచి రూ. 320లకు చేరుతుందన్నమాట.