మానవత్వం చాటుకున్న బస్ డ్రైవర్

మానవత్వం చాటుకున్న బస్ డ్రైవర్

మనిషి మాయం కాలేదు.. మానవత్వం బతికే ఉందని నిరూపించే ఘటన అమెరికాలోని మిల్వాకీలో జరిగింది. విధి నిర్వహణలో భాగంగా ఓ మహిళా డ్రైవర్ బస్సు నడుపుతోంది. ఇంతలో ఓ ఘటన ఆమె కళ్ల పడింది. వణికించే చలిలో అంత పెద్ద రహదారిలో ఉత్తి కాళ్లతో నడుస్తున్న ఓ పసిపాప ఆ డ్రైవర్ కంట పడింది. వెంటనే బస్సు ఆపి ఆ బిడ్డని రక్షించి బస్సెక్కించింది. ఈ ఘటన మిల్వాకీ కౌంటీ ట్రాన్సిట్ సిస్టమ్ సీసీటీవీలో రికార్డయింది. ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

ఇరినా ఇవిచ్ ఓ బస్సు డ్రైవర్. మిల్వాకీలో ఓ రహదారిపై వేగంగా బస్సును నడుపుతోంది. ఇంతలో వాహనాలు వేగంగా పోయే ఆ రహదారిపై గడ్డ కట్టించే చలిలో కాళ్లకు ఎలాంటి రక్షణ లేకుండా నడుస్తున్న ఓ బిడ్డ కనపడింది. ఇరినా బస్సు ఆపేంతలోనే ఆ పాప ఓ మలుపుకు చేరుకుంది. వెంటనే బస్సుని ఆపిన ఇవిచ్ రోడ్డుకి అడ్డంగా పరుగులు పెట్టి ఆ బిడ్డని ఎత్తుకుని బస్సులోకి వచ్చింది. ఎందుకు బస్సు ఆగిందని గాభరాపడిన ప్రయాణికులు పాపను తెచ్చిన చూసి అవాక్కయ్యారు. వెంటనే ఓ ప్రయాణికురాలు తన కోటు తీసి మంచుగడ్డలా చల్లగా ఉన్న ఆ పాపపై కప్పింది. ఇరినా ఆ 19 నెలల పాపను జోకొట్టి నిద్రపుచ్చి తిరిగి బస్సు నడిపింది. 

ఈ ఘటన డిసెంబర్ 22న జరిగింది. తల్లి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆ పాప అలా రోడ్డుపైకొచ్చినట్టు పోలీస్ అధికారులు గుర్తించారు. ఆ బిడ్డను తండ్రికి అప్పజెప్పారు. ఇరినా ఇవిచ్ పనిచేసే మిల్వాకీ కౌంటీ ట్రాన్సిట్ సిస్టమ్ సంస్థ ఆమె చేసిన పనిని ప్రశంసించి అభినందనలు తెలియజేసింది.