భార్యకు కరోనా.. ఆందోళనతో భర్త మృతి

భార్యకు కరోనా.. ఆందోళనతో భర్త మృతి

కోరుట్లలో దారుణం చోటు చేసుకుంది. భార్యకు కరోనా సోకడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె భర్త మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. రాఘవపేటకు చెందిన బెజ్జారపు పరమానందంకు ఇద్దరు భార్యలు. రెండో భార్యకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. తన ఇల్లాలికి వైరస్‌ రావడంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం గుండెపోటుతో మృతిచెందాడు. పరమానందం అంత్యక్రియలు చేయడానికి బంధువులు, చుట్టుపక్కలవారు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన భార్య తల్లడిల్లింది. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌  ఈ విషయాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కోరుట్లకు చెందిన ఆల్‌ ఇండియా మానవత్వ సందేశ సమితి సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంస్థ సభ్యులు ప్రత్యేక అంబులెన్స్‌లో రాఘవపేటకు చేరుకున్నారు. పీపీ కిట్లు ధరించి, పరమానందం మృతదేహాన్ని గ్రామ శివారులోని శ్మశానవాటికకు తీసుకెళ్లి, అంత్యక్రియలు నిర్వహించారు.