వెలిగిపోతోన్న మేడిగడ్డ బ్యారేజీ

వెలిగిపోతోన్న మేడిగడ్డ బ్యారేజీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతోంది.. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి షెడ్యూల్ ఖరారు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. అతిథులను ఆహ్వానించే పనిలో ఉన్నారు. ఈనెల 21వ తేదీ ఉదయం వేద బ్రాహ్మణులు మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద ఏకకాలంలో హోమాలు నిర్వహిస్తారు. మొదట మహారాష్ట్ర, ఏపీ ముఖ్యమంత్రులు ఫడణవీస్‌, జగన్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ మేడిగడ్డ చేరుకుంటారు. బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసే కాళేశ్వర ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించి... ఆ తర్వాత ముగ్గురు సీఎంలు కన్నెపల్లి పంప్‌హౌస్‌ చేరుకొని, మూడు మోటార్లను ప్రారంభించనున్నారు. ఇక, ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మేడిగడ్డ బ్యారేజీకి రకరకాల విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కావొస్తుండగా... సాయంత్రం అయితే, చాలు మేడిగడ్డ బ్యారేజీకి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో ఆ ప్రాంతం వెలిగిపోతోంది. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన ఫొటోలను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సోషల్ మీడియాలో షేర్ చేశారు.