కేరళకు మళ్లీ తుపాను హెచ్చరిక...

కేరళకు మళ్లీ తుపాను హెచ్చరిక...

భారీ వరదల ప్రభావం నుండి కోలుకుంటున్న కేరళకు మరో తుపాను ప్రమాదం పొంచి ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం క్రమేపి బలపడి ఈ నెల 8వ తేదీకల్లా అల్ప పీడనంగా మారుతుంది. అనంతరం అది భారీ తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఈ తుఫాను ప్రభావం ఉంటుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా అరేబియా సముద్ర తీరం,  శ్రీలంక తీరానికి సమీపంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ... ఆదివారం వర్షాలు కురవనున్న నేపథ్యంలో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామన్నారు. ముందస్తు జాగ్రత్తగా జాతీయ విపత్తు దళాన్ని అందుబాటులో ఉంచాలని కేంద్రాన్ని కోరామన్నారు. మరోవైపు జిల్లా అధికారులను కూడా అప్రమత్తం చేసాం. వేటకెళ్లిన మత్స్యకారులు ఐదో తేదీలోపు తీరానికి చేరుకోవాలని కోరాం. ఇక పర్వత ప్రాంతాలకు పర్యాటకులు రావొద్దని సీఎం పినరయి విజయన్ సూచించారు.