12 పాసైన వాళ్లకి ఓటేయొద్దు

12 పాసైన వాళ్లకి ఓటేయొద్దు

సరిగ్గా లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతలంతా మూకుమ్మడిగా మోడీ ప్రభుత్వంపై తమ శాయశక్తులా దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిర్వహించిన ‘తానాషాహీ హటావో, లోక్ తంత్ర బచావో’ ర్యాలీకి కూడా పలువురు పెద్ద నేతలు హాజరయ్యారు. ఈ ర్యాలీలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, సీపీఎం దిగ్గజం సీతారామ్ ఏచూరి, సీపీఐ నేత డి.రాజా, కాంగ్రెస్ తరఫున ఆనంద్ శర్మ, ఎల్జేడీ చీఫ్ శరద్ యాదవ్, ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్, ఆర్ఎల్డీకి చెందిన త్రిలోక్ త్యాగి వంటి పలువురు కీలక విపక్ష నేతలంతా పాల్గొన్నారు. 

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ భారత ప్రధానా లేక పాకిస్థాన్ కా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ సారి ఎవరైనా చదువుకున్న వ్యక్తికి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఐదేళ్ల క్రితం గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన జరిగిందని ఇవాళ పార్లమెంట్ చివరి రోజున మరో ఆందోళన జరుగుతోందని అరవింద్ అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధికారాలను ఉల్లంఘిస్తూ మోడీ 40 మంది సీబీఐ అధికారులను కోల్ కతాకు పంపారని ఆరోపించారు. ఆ రోజు కోల్ కతా పోలీస్ కమిషనర్ అరెస్టయి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలకు భయపడనక్కర్లేదు కేంద్రానికి భయపడితే చాలనే సందేశం ప్రజలకు చేరేదని విమర్శించారు. రాజ్యాంగానికి అండగా నిలిచిన సీఎం మమతా బెనర్జీకి సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. 

తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇవాళ మోడీకి పార్లమెంటులో చివరి రోజని గర్జించారు. నెల రోజుల తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఇంక మిగిలింది 20 రోజులేనన్నారు. ఆ తర్వాత మోడీ ఏమనుకున్నా ఏమీ చేయలేరని చెప్పారు. భయపడేవారు మరణిస్తారని.. పోరాడేవారు విజయం సాధిస్తారని పిలుపునిచ్చారు. దేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మమత కాంగ్రెస్, సీపీఎంతో కలిసి పనిచేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలతో పోరాటం కొనసాగుతుందని కానీ కేంద్రంలో జట్టు కడతామన్నారు.

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారుఖ్ అబ్దుల్లా ప్రధానమంత్రి మోడీని తీవ్రంగా విమర్శించారు. మతం పేరిట జరగని జలియన్ వాలా బాగ్ మూకుమ్మడి హత్యోదంతంలో పారిన రక్తాన్ని గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ దేశం  హిందువులదో, ముస్లింలదో కాదని.. ఇది ప్రతి ఒక్కరి భారతదేశం అన్నారు. దేశాన్ని ముక్కలు చేసేవారి నుంచి రక్షించుకోవాల్సి ఉందని ఫారుఖ్ హెచ్చరించారు. మన హృదయాలు స్వచ్ఛమయ్యేంత వరకు ఇదంతా తేలికగా జరగదన్నారు. అందరూ మేం ప్రధానమంత్రి అవుతామంటారు కానీ ముందు ఇవాళ ఉన్న ప్రధానిని తొలగిస్తే కదా మీరు పీఎం అయ్యేదని ఆయన చెప్పారు.