ఆరోన్‌ ఫించ్.. ప్రపంచ రికార్డు

ఆరోన్‌ ఫించ్..  ప్రపంచ రికార్డు

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, టీ-20 కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ముక్కోణపు టీ-20 సిరీస్‌లో భాగంగా మంగళవారం జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫించ్‌ 172(76 బంతుల్లో 16 ఫోర్లు, 10 సిక్సర్లతో) పరుగులు సాధించాడు. దీంతో అంతర్జాతీయ టీ-20ల్లో అత్యధిక పరుగులు  సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఇంతకుముందు (2013లో ఇంగ్లండ్‌పై 156) తన పేరిటే ఉన్న రికార్డును ఫించ్ అధిగమించాడు. అయితే టీ-20 క్రికెట్‌లో క్రిస్‌ గేల్‌ అత్యధికంగా 175(ఐపీఎల్‌లో) పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టీ-20ల్లో ఫించ్ రెండో సెంచరీ సాధించాడు. టీ-20 ఫార్మాట్‌లో తన వేగవంతమైన అర్ధ  సెంచరీని 22 బంతుల్లో ముగించిన ఫించ్‌.. అదే క్రమంలో 50 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. 19.2 ఓవర్ల పాటు ఆడిన ఆసీస్ ఓపెనింగ్‌ జోడీ 223 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది.

టాస్‌ గెలిచిన జింబాబ్వే తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఆసీస్‌ బ్యాటింగ్‌ కి దిగింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను ఫించ్‌, డీ ఆర్సీ షాట్‌లు ధాటిగా ఆరంభించారు. ఓపెనర్ షాట్‌(46;  42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) నెమ్మదిగా ఆడినా.. ఫించ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వరద పారిస్తూ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సెంచరీ అనంతరం జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు. 172 పరుగులో 124 పరుగుల్ని ఫోర్లు, సిక్సర్లు ద్వారా ఫించ్‌ సాధించాడు. షాట్‌, ఫించ్‌ దూకుడుతో ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 229 పరుగులు భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లకు 129 పరుగులు చేసి ఓటమి చవిచూసింది. జింబాబ్వే తరుపున ఓపెనర్ సోలమన్ మిరే(28) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్ ఆండ్రూ టైకి మూడు వికెట్లు దక్కాయి. ఫించ్ కు 'మ్యాన్ ఆఫ్ ద  మ్యాచ్' అవార్డు లభించింది.