పాకిస్థాన్ నుంచి కెనడా చేరుకున్న ఆసియా బీబీ

పాకిస్థాన్ నుంచి కెనడా చేరుకున్న ఆసియా బీబీ

దైవదూషణ కేసు నుంచి విముక్తురాలైన ఆసియా బీబీ తన సొంతగడ్డ పాకిస్థాన్ కు గుడ్ బై చెప్పేసింది. సంప్రదాయవాదుల బెదిరింపులకు భయపడి ఆసియా బీబీ కెనడా చేరుకుంది. నలుగురు పిల్లల తల్లైన ఆసియాను 2010లో దైవదూషణ ఆరోపణల్లో దోషిగా నిర్ధారించి మరణ దండన విధించడమైంది. పొరుగువారితో కొట్లాటలో ఆమె ఇస్లాంను అవమానించిందనే ఆరోపణ వచ్చింది. 

ఆసియా అన్ని ఆరోపణలను తిరస్కరిస్తూ తనకే పాపం తెలియదని, తాను నిర్దోషినని వాదించింది. గత ఏడాది అక్టోబర్ లో సుప్రీంకోర్ట్ ఆసియాను కింది కోర్టు విధించిన మరణ దండనను రద్దు చేసింది. కోర్టు ఆమెను నిర్దోషిగా నిర్ధారిస్తూ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై ఆగ్రహించిన సంప్రదాయవాదులు రోడ్లపై నిరసన ప్రదర్శనలకు దిగారు. ఆసియాను చంపుతామని బెదిరించసాగారు. దీంతో ఆసియా భర్త ఆషిక్ మసీహ్ ఆమెను సురక్షితంగా పాకిస్థాన్ నుంచి బయటికి తీసుకెళ్లే ప్రయత్నాలు ప్రారంభించారు. 

ఇందుకు అతను అమెరికా, బ్రిటన్, కెనడాల సహాయం అర్థించాడు. బుధవారం ఆసియా కెనడా చేరుకున్నట్టు చెబుతూ ఆమె తరఫు న్యాయవాది సైఫుల్ మలూక్ ఇదో పెద్ద రోజని వ్యాఖ్యానించారు. ఆసియా కెనడాలో తన కుటుంబాన్ని కలిసినట్టు చెప్పారు. దీంతో న్యాయం పూర్తిగా జరిగిందన్నారు. ఆసియా సురక్షితంగా కెనడా చేరుకొనడంలో సాయపడినందుకు మానవహక్కుల కార్యకర్తలు, విదేశీ రాజకీయవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు.