రివ్యూ : ఆటగాళ్లు

రివ్యూ : ఆటగాళ్లు

నటీనటులు : నారారోహిత్ , జగపతిబాబు,బ్రహ్మానందం, దర్శన బానిక్ తదితరులు 

మ్యూజిక్ : సాయి కార్తీక్ 

ఫోటోగ్రఫి : విజయ్ సి కుమార్ 

నిర్మాత : వాసిరెడ్డి రవీంద్రనాథ్, రాము మక్కెన, వడ్లపూడి జితేంద్ర, వాసిరెడ్డి శివాజీ

దర్శకత్వం ; పరుచూరి మురళి 

రిలీజ్ డేట్ : 24-08-2018

బాణంతో మొదలుపెట్టిన నారా రోహిత్ సినిమా సినిమాకు వైవిధ్యభరితమైన కథను ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నాడు.  జగపతిబాబు హీరోగా ఉన్నప్పటికంటే.. విలన్ గా మారిన తరువాత అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి.  ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమా ఆటగాళ్లు.  మరి ఈ ఆటగాళ్లు రంగస్థల మైదానంలో ఎంతమేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.  

కథ : 

దర్శకుడు నారా రోహిత్ తాను ప్రేమించిన ప్రేయసి దర్శన బానిక్ ను పెళ్లి చేసుకుంటాడు.  పెళ్ళైన తరువాత వీరి లైఫ్ హ్యాపీగా సాగుతుంది.  అలా కొంతకాలం హ్యాపీగా సాగిన తరువాత.. సడెన్ గా దర్శన హత్యకు గురౌతుంది.  ఈ హత్యను భర్త నారా రోహిత్  చేశాడనే అనుమానంతో.. పోలీసులు అరెస్ట్ చేస్తారు.  నారా రోహిత్ హత్య విషయంపై ప్రభుత్వం జగపతిబాబును పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమిస్తుంది.  కోర్టు అనుమతితో.. రోహిత్ ను కస్టడీలోనే ప్రశ్నించడం మొదలుపెడతాడు.  జగపతిబాబు ఎలాంటి ప్రశ్నలు వేశాడు..? దానికి నారా రోహిత్ ఎటువంటి  సమాధానాలు చెప్పాడు..? నారా రోహిత్ నే భార్యను హత్య చేశాడా..? సిద్దార్దని ఎందుకు అరెస్ట్ చేశారు..? చివరికి ఏమైంది అన్నది చిత్ర కథ.  

విశ్లేషణ : 

ఇలాంటి థ్రిల్లింగ్, మైండ్ గేమింగ్ తో కూడిన కథలు గతంలో చాలా వచ్చాయి.  కథనాల్లో ఏదైనా కొత్తదనం కనిపిస్తే అది ఆసక్తిగా మారుతుంది.  ఇందులో హత్యానేరం మోపబడ్డ నారా రోహిత్, హత్య కేసును టేకప్ చేస్తున్న జగపతిబాబులు ఇద్దరు చాలా తెలివైన వ్యక్తులుగా కనిపిస్తారు.  వారిద్దరి మధ్య మైండ్ గేమ్ నడుస్తుంది.  ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా త్రిల్లింగ్ అనిపిస్తాయి.  ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నారా రోహిత్ హత్యకేసులో పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత ఓ ఉత్కంఠత రేకెత్తుతుంది.  అరె ప్రేమించిన భార్యను ఎందుకు హత్య చేస్తాడు అనే ప్రశ్న ప్రతి ప్రేక్షకుడిలో కలుగుతుంది.  ఈ సన్నివేశాలు మనల్ని కథలో లీనమయ్యేలా చేస్తాయి.  

లాయర్ జగపతిబాబు అడిగే ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు చెప్పాలని అనుకున్నా.. తరువాత లాయర్ కు తన కథను చెప్పడం మొదలుపెడతాడు నారా రోహిత్.  అన్ని సినిమాల్లాగే ఇందులో కూడా ప్రారంభ సన్నివేశాలు సాదాసీదాగా ఉంటాయి.  సీన్స్ నడిచే కొద్దీ ఆసక్తి రేగుతుంది.  కథ సీరియస్ గా సాగే సమయంలో వచ్చే కామెడీ ట్రాక్ బోర్ కొట్టించింది.  కామెడీ లేకపోతే సినిమా ఇంకాస్త ఆసక్తి కలిగించేదేమో.  ఫ్యాష్ బ్యాక్ తో నడుస్తున్న కథలో చిన్న ట్విస్ట్ తో విశ్రాంతి ఇచ్చాడు.  

ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు సెకండ్ హాఫ్ బలం కావాలి.  నారా రోహిత్, జగపతిబాబుల మధ్య అలాంటి సన్నివేశాలు తీసుకొచ్చేందుకు దర్శకుడు ప్రయత్నం చేశాడు.  ఆ తరహా ఫీల్ ను పండించడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు.  దర్శకుడు బ్రెయిన్ కు ఇంకాస్త పదును పెట్టి ఉంటె బాగుండేది.  సెకండ్ హాఫ్ లో చాలా చోట్ల సన్నివేశాలు లాజిక్ లేకుండా ఉన్నాయి.  ఇవి కొంచెం బోర్ కొట్టించాయి.  క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంది.  

 

నటీనటుల పనితీరు : 

జగపతిబాబు మరోసారి ఈ సినిమాలో ఆకట్టుకున్నారు.  పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అయన ప్రదర్శించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. నారా రోహిత్ ఈ తరహా పాత్ర కొత్త.  దర్శకుడి పాత్రలో ఒదిగిపోయాడు.  దర్శన బానిక్ అందంతో ఆకట్టుకుంది.  బ్రహ్మానందం కామెడీ పర్లేదు.  

సాంకేతికం : 

కమర్షియల్, ఫ్యామిలీ కథలతో సినిమాలను తెరకెక్కించే పరుచూరి మురళి మొదటిసారి క్రైమ్ డ్రామా కథను ఎంచుకొని ఆటగాళ్లు సినిమా చేశాడు.  కథ బాగున్నా.. కథనాల్లో బిగుతు కనిపించలేదు.  క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు స్క్రీన్ ప్లే నే ఆయువుపట్టు.  ఏమాంత్రం లోపం కనిపించినా.. సినిమా పేకమేడలా కూలిపోతుంది.  ఆటగాళ్ల విషయంలోనూ అదే జరిగింది. స్క్రీన్ ప్లే పై దృష్టి సారిస్తే సినిమా మరోలా ఉండేది.  నిర్మాణ విలువలు పర్వాలేదు.  సాయి కార్తీక్ సంగీతం, విజయ్ సి కుమార్ కెమెరా సినిమాకు బలాన్ని ఇచ్చాయి.  

పాజిటివ్ పాయింట్స్ : 

నటీనటులు 

ఫస్ట్ హాఫ్ 

కథ 

నెగెటివ్ పాయింట్స్ : 

లాజిక్ లేని సీన్స్ 

కథనాలు

కామెడీ లేకపోవడం 

చివరిగా : ఆటగాళ్లకు ఇంకాస్త బలాన్ని ఇస్తే బాగుండేది.