రివ్యూ : ఆటగదరా శివ

రివ్యూ : ఆటగదరా శివ

నటీనటులు: ఉదయ్‌ శంకర్‌, దొడ్డన్న, హైపర్‌ ఆది, ‘చలాకీ’ చంటి, చమ్మక్‌ చంద్ర.. 

మ్యూజిక్: వాసుకీ వైభవ్‌

ఫోటోగ్రఫి: లవిత్‌

నిర్మాత: రాక్‌లైన్‌ వెంకటేష్‌

దర్శకత్వం: చంద్ర సిద్ధార్థ 

రిలీజ్ డేట్: 20-07-2018

 ఆ నలుగురు వంటి హృదయానికి హత్తుకునే చిత్రాన్ని తీసిన చంద్ర సిద్దార్ధ.. ఆ తరువాత అందరి బంధువయా వంటి సినిమాతో ఆకట్టుకున్నారు.  చంద్ర సిద్దార్ధ సినిమాల్లో.. మంచితనం, మానవత్వం, విలువలు ఇవన్నీ ఆయన సినిమాల్లో మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి.  మనసుకు హత్తుకునే చిత్రాలను తీసే చంద్ర సిద్దార్ధ ఇప్పుడు ఆటగదరా శివ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దామా.. 

కథ : 

ఉదయ్ శంకర్ ఉరిశిక్ష పడ్డ ఖైదీ.  మరో నాలుగు రోజుల్లో ఉరి అనగా.. జైలు నుంచి తప్పించుకుంటాడు.  జైలు నుంచి తప్పించుకొని.. హైవేలో ప్రయాణిస్తుంటాడు.  నరమానవుడు కూడా కనిపించని మార్గంలో దొడ్డన్న అనే వ్యక్తి లిఫ్ట్ ఇస్తాడు.  దొడ్డన్న ఎవరో కాదు తలారి.  ఉదయ్ శంకర్ ను ఉరితీయాల్సింది ఆయనే.  జైలు నుంచి తప్పించుకున్న ఉదయ్ శంకర్ ను పట్టిస్తే.. పదిలక్షలు రివార్డ్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ ప్రకటనను దొడ్డన్న చూస్తాడు. మరి ఉదయ్ శంకర్ ను తలారి దొడ్డన్న పోలీసులకు అప్పగించాడా..? వీరి ప్రయాణం ఎలా సాగింది..? వీళ్లిద్దరి పరిచయం వారిలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అన్నది మిగతా కథ. 

విశ్లేషణ : 

కన్నడలో విజయం సాధించిన "రామ రామ రామారే" సినిమాకి ఇది రీమేక్.  ఒరిజినల్ సినిమాలో ఎలా ఉన్నదో దానినే ఎలాంటి మార్పులు చేయకుండా రీమేక్ చేశాడు.  చంద్రసిద్దార్ధ సినిమాల్లో ఫిలాసఫీ ఎక్కువగా ఉంటుంది.  ఇందుకు ఉదాహరణ ఆ నలుగురు సినిమా.  అలాంటి ఫిలాసఫీనే ఈ సినిమాలో కూడా జొప్పించి మెప్పించాడు దర్శకుడు.  తలారి, ఉరిశిక్ష పడ్డ ఖైదీల మధ్య జరిగే సన్నివేశాలతో కూడిన సినిమా ఇంతవరకు రాలేదు.  ఈ సినిమా రొటీన్ కు భిన్నంగా ఉన్నది.  తలారి, ఉరిశిక్ష పడ్డ ఖైదీల ప్రయాణంలో ఎన్ని విషయాలు చర్చకు వస్తాయి ప్రయాణం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుంది.  ఎలాంటి పరిచయం లేని మనుషుల మధ్య చిన్న చిన్న ప్రయాణాలు, త్యాగాలు అనుబంధాన్ని పెంచుతాయన్న మంచి విషయాన్ని అంతర్లీనంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.  క్లైమాక్స్ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయి.  మంచి సినిమా చూడాలి అనుకునే వాళ్లకు, రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలు చూడాలి అనుకునే వాళ్లకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.  

నటీనటుల పనితీరు : 

హీరో ఉదయ్ శంకర్ తన మొదటి సినిమాతో ఆకట్టుకున్నాడు.  ఖైదీ అంటే ఎలా ఉంటాడో అచ్చంగా అలాగే ఉన్నాడు.  మొదటి అర్ధభాగంలో అతని పాత్ర మాట్లాడేది చాలా తక్కువ.  చూపులతోనే భావాల్ని పలికించాడు.  తలారిగా నటించిన  దొడ్డన్న ఆ పాత్రలో ఇమిడిపోయాడు.  తలారి ఎలా కఠినంగా ఉంటాడో అలాంటి లుక్స్ తో ఆకట్టుకున్నాడు.  హైపర్ ఆది, చంటి, చమ్మర్ చంద్రలు వారి పాత్రల మేరకు నవ్వించారు.  

సాంకేతిక వర్గం : 

చంద్ర సిద్దార్ధ కథను నడిపించిన తీరు బాగుంది.  ఫిలాసఫీని సినిమాటిక్ గా చెప్తే తప్పకుండా వింటారని చంద్రసిద్దార్ధ మరోసారి నిరూపించాడు.  క్లైమాక్స్ చిత్రీకరణ సినిమాకే హైలైట్ గా నిలిచింది.  సంభాషణలు అద్భుతంగా ఉన్నాయి.  పాటలన్నీ సందర్భోచితంగా వచ్చేవే తప్పించి ట్రాక్ తప్పలేదు.  సినిమాటోగ్రఫీ బాగుంది.  ముఖ్యంగా హైవేపై చిత్రీకరణ బాగుంది.  

పాజిటివ్ పాయింట్స్ : 

కథ 

కథనాలు 

నటీనటులు 

పాటలు 

సంగీతం 

సంభాషణలు 

దర్శకత్వం 

నెగెటివ్ పాయింట్స్ : 

స్లో నెరేషన్ 

చివరిగా : రొటీన్ కు భిన్నంగా.. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే సినిమా.. ఆటగదరా శివ.