మళ్లీ విధుల్లో చేరిన అభినందన్...ఐఏఎఫ్ చీఫ్ తో మిగ్-21లో చక్కర్లు

మళ్లీ విధుల్లో చేరిన అభినందన్...ఐఏఎఫ్ చీఫ్ తో మిగ్-21లో చక్కర్లు

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి డ్యూటీ ఎక్కారు. బాలకోట్ దాడుల్లో ధైర్యంగా పోరాడి. పాకిస్థాన్ సైన్యానికి చిక్కిన తర్వాత కొంతకాలం పాటు విధులకి దూరమయున ఆయన తొలిసారిగా ఆయన మిగ్-21 విమానం నడిపారు. వైమానిక దళ అధిపతి బీస్ ధనోవా కలిసి ఈరోజు మిగ్-21 యుద్ధ విమానాన్ని నడిపారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం నుంచి మిగ్‌-21ని నడిపారు. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ధనోవా కూడా మిగ్‌-21 పైలటే కావడం గమనార్హం. 1999 కార్గిల్‌ యుద్ధం సమయంలో నియంత్రణా రేఖ వెంట మిగ్‌-21ని సమర్థంగా నడిపిన ధనోవా శత్రు సైనికుల విమానాలకు చుక్కలు చూపించారు.

అభినందన్‌ తిరిగి యుద్ధవిమానాన్ని నడపబోతున్న సందర్భంగా ఆయనకు తోడుగా ధనోవా వెంట వెళ్లాడు. పాక్‌ చెర నుంచి వచ్చిన తర్వాత అభినందన్‌ కొన్ని రోజుల పాటు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఆయనకు అనేక వైద్య పరీక్షలు నిర్వహించారు. పలు దఫాల పరీక్షల తర్వాత కొన్ని రోజులు కశ్మీర్‌లో గ్రౌండ్‌ ఆపరేషన్స్‌లో విధులు నిర్వర్తించారు. భద్రతా కారణాల దృష్ట్యా తిరిగి అతన్ని మరో ప్రాంతానికి బదిలీ చేశారు. చివరగా మరోసారి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించి మిగ్‌-21 నడపడానికి అభినందన్ పూర్తి సామర్థ్యం ఉందని వైద్యులు తేల్చారు.