కోర్టు నోటీసులకు భయపడేదిలేదు: అచ్చెంనాయుడు 

కోర్టు నోటీసులకు భయపడేదిలేదు: అచ్చెంనాయుడు 

బాబ్లీ కేసులో ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నోటీసులకు బయపడేదిలేదని ఏపీ మంత్రి అచ్చెం నాయుడు స్పష్టం చేశారు. ఈ నోటీసులు మాకు ఇచ్చినట్లు కాదని తెలుగు ప్రజలందరికి ఇచ్చిన నోటీసులుగా భావిస్తున్నామని అన్నారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పోరాడినందుకు గర్వంగా ఉందన్నారు. కేసులు వెనక్కితీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ప్లేట్ ఫిరాయించిందని ఆయన ఎద్దేవా చేశారు. 8 ఏళ్లనాటి కేసుకు సంబంధించి ఉద్దేశ్యపూర్వకంగానే కోర్టు నోటీసులు పంపించారని మంత్రి అచ్చెంనాయుడు ఆరోపించారు.  

మోదీ, కేసీఆర్, జగన్ లకు చంద్రబాబు మొగుడులా తయారయ్యారని అచ్చెం నాయుడు తెలిపారు. చంద్రబాబును దెబ్బకొట్టేందుకు ఇలాంటి చిల్లర పనులు మానుకోవాలని కేంద్రాన్ని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అరుదైన అవకాశం చంద్రబాబుకు లభించిందని, దానిని అడ్డుకునేందుకు ఇదంతా చేస్తున్నారనే అనుమానం కలుగుతుందని మంత్రి అచ్చెంనాయుడు తెలిపారు.