కొరటాలను బెదిరించిన చిరంజీవి

కొరటాలను బెదిరించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'ఆచార్య' షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. అది ఓకే... కానీ  సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ మాత్రం నిల్! న్యూ ఇయర్ డే చిరంజీవి సినిమాకు సంబంధించిన ఏదో ఒక ప్రకటన వస్తుందని మెగాభిమానులంతా ఎదురుచూశారు... ప్చ్... రాలేదు! కనీసం సంక్రాంతి పండక్కి అయినా వస్తుందని, మెగాస్టార్ పండగ రోజున ఏదో రకంగా సందడి చేస్తారని భావించారు. కానీ వారి ఎదురుచూపులు ఫలించలేదు!! 'ఆచార్య' మూవీ సామాజికాంశం నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో కనీసం రిపబ్లిక్ డే కైనా... ఏదో ఒక అప్ డేట్ వస్తుందని అభిమానులు భావించారు. కానీ వారి ఆశలు నిరాశకు గురయ్యాయి. నిజానికి ఇదే అసహనం చిరంజీవికి కూడా కలుగుతున్నదనిపిస్తోంది. 

దర్శకుడు కొరటాల శివతో సీరియస్ డిస్కషన్ జరిగిందని, దానికి సంబంధించిన అప్ డేట్ ను సాయంత్రం 6.30కి ఇస్తానని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా చెప్పగానే... అభిమానులంతా గంపెడు ఆశలు పెట్టుకున్నారు... తీరా చూస్తే... చిరంజీవి తనలోని అసహనాన్ని మీమ్స్ రూపంలో వెల్లడించారు. 
'ఆచార్య' టీజర్ గురించి తనకు... కొరటాల శివకు మధ్య జరిగిన సంభాషణను సరదాగా మార్చి... మీమ్స్ గా చేసి 6.30కి ఓ పోస్ట్ పెట్టారు. ఏతా వాతా తేలిందేమంటే... బుధవారం ఉదయం 10.00కి టీజర్ రిలీజ్ కు సంబంధించిన ప్రకటనను కొరటాల శివ ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు.

గతంలోనూ తమ చిత్రం టైటిల్ ను కన్ ఫామ్ చేయకుండా కొరటాల శివ నాన్చుతూ ఉంటే... చిరంజీవే... ఓ సినిమా ఫంక్షన్ లో యధాలాపంగా 'ఆచార్య' టైటిల్ ను ప్రకటించేశారు. చివరకు టీమ్ కూడా అదే టైటిల్ ను ప్రకటించాల్సి వచ్చింది. మరి అలానే... కొరటాల శివ తుది మెరుగులు దిద్దకుండానే 'ఆచార్య' టీజర్ సోషల్ మీడియాలో త్వరలో ప్రత్యక్షం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
మెగాస్టారా... మజాకా!!