జగన్ ఆ పని చెయ్.. మా పార్టీ మూసేస్తాం : అచ్చెన్న సవాల్ !

జగన్ ఆ పని చెయ్.. మా పార్టీ మూసేస్తాం :  అచ్చెన్న సవాల్ !

 

 

ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పై రెఫరెండంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీ ఓడిపోతే మా పార్టీ మూసివేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు వైసీపీకి సవాల్ విసిరారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టిడిపి నాయకులు కిరణ్ కుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, శ్రావణి, రహీం, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.

మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విసిరిన సవాల్ స్వీకరించకుండా ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారని అన్నారు. గత జనరల్ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు అనేక ఆరోపణలు చేశారని, ఆయన అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా వాళ్ళ చిన్నాన్న హత్య కేసులో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధం ఉన్నట్లు నిరూపించలేక పోయారని  ఎద్దేవా చేశారు. 

స్వయానా చిన్నాన్న హత్య కేసు పరిష్కరించలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాన్యులకు ఏమి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ప్రస్తుత పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో పర్యటిస్తుండగా ఇక్కడి ప్రజలు వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత తెలుపుతూ తమ పార్టీ పట్ల అభిమానాన్ని చూపుతున్నారని , ప్రజల స్పందన బాగుందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి తెలుగుదేశం పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అచ్చెన్న తెలిపారు.