అవినాష్‌ - వివేకా మధ్య విభేదాలున్నాయి: ఆది

అవినాష్‌ - వివేకా మధ్య విభేదాలున్నాయి: ఆది

వైఎస్‌ వివేకానందరెడ్డి మృతికి సంబంధించి టీడీపీపై ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. ఎక్కడో జరిగిన దాన్ని.. తమకు ఆపాదించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇవాళ అమరావతిలో ఆయన మాట్లాడుతూ మొదట గుండె పోటు అని ప్రకటించి.. ఆ తర్వాత అనుమానాస్పద మరణం అంటూ మార్చి తమపై విమర్శలు చేస్తున్నారని  అన్నారు. జగన్‌పై జరిగిన దాడి కేసులోనూ తనపై ఇటువంటి ఆరోపణలే చేశారని గుర్తు చేశారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరగాల్సిందేనని.. తప్పు చేసిన వారికి ఉరి శిక్ష వేయాలని అభిప్రాయపడ్డారు.  రాజకీయ.. డబ్బు కాంక్షతో ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్టు కాదని అన్నారు. ఫ్యాక్షన్ వద్దని రాజీపడి ప్రశాంతంగా ఉంటున్న తమపై ఇటువంటి ఆరోపణలు చేయడం విజ్ఞత కాదని ఆదినారాయణరెడ్డి అన్నారు.  

అవినాష్‌రెడ్డి, వివేకానందరెడ్డి మధ్య ఎంపీ టికెట్‌కు సంబంధించి గొడవలున్నాయని ఆయన చెప్పారు. వివేకానందరెడ్డి కడప ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్నారని.. ఎమ్మెల్సీగా ఓడినప్పటి నుంచి ఆవేదనతో ఉన్నారని ఆదినారాయణరెడ్డి చెప్పారు. 'వారి మధ్య కుటుంబ గొడవలున్నాయి. గతంలో విజయమ్మ పైనా వివేకా పోటీ చేశారు' అని అన్నారాయన.