నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత...భారీగా పోలీసుల మోహరింపు

నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత...భారీగా పోలీసుల మోహరింపు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 14వ రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో పాల్గొన్న జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేశారు. అటు అడ్వకేట్లు కూడా కార్మికులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోల దగ్గర కార్మికులు నిరసనకు దిగారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా హైదరాబాద్ బీహెచ్ఈఎల్ నుంచి కూకట్ పల్లి వరకూ బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించింది.

లింగంపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీలో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఆర్టీసీ కార్మికులు, బీజేపీ కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా బీజేపీ నిర్వహించిన ర్యాలీ, కూకట్ పల్లి సభలో ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్తామ రెడ్డి పాల్గొన్నారు.  కోర్టు చెప్పినా ప్రభుత్వం స్పందించడం లేదని, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వ్యవహరిస్తోందని ఘాటుగా విమర్శించారు.

ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సినవి ఏమి ఇవ్వలేదన్న అశ్వద్ధామరెడ్డి, పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అంతకు ముందు అశ్వత్థామరెడ్డి అరెస్టయ్యారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఆయనను అరెస్టు చేశారు పోలీసులు. రేపు  తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన జేఏసీ... దానిని విజయవంతం చేయాలని కోరుతూ బైక్‌ ర్యాలీ చేపట్టింది. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అశ్వత్ధామరెడ్డిని అరెస్టు చేశారు. ఇక ఈ క్రమంలో నాంపల్లి కోర్టు దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అడ్వకేట్లు నిరసనకు దిగారు. కేసీఆర్‌ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అక్కడి నుంచి బస్‌భవన్‌కు ర్యాలీగా బయల్దేరారు. లాయర్టు ఆందోళనకు దిగడంతో పోలీసులు భారీగా మోహరించారు.