టీ20ల్లో అఫ్గానిస్థాన్ సరికొత్త రికార్డు

టీ20ల్లో అఫ్గానిస్థాన్ సరికొత్త రికార్డు

టీ20 క్రికెట్ లో రికార్డులు బద్దలవడం సహజమే. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పుడిప్పుడే తన ఉనికిని చాటుకుంటున్న అఫ్గానిస్థాన్ టీ20ల్లో భారీ స్కోర్ చేసి చరిత్ర సృష్టించడం గమనార్హం. ఉత్తరాఖండ్‌లో ఆఫ్గానిస్థాన్, ఐర్లాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్ ఓపెనర్ హజ్రతుల్లా వీరవిహారం చేసాడు. బౌండరీలు, సిక్సులే లక్ష్యంగా ఆడి ఐర్లాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. చివరకి వరకు క్రీజులో ఉన్న హజ్రతుల్లా 261.29 స్ట్రైక్ రేటుతో (162 పరుగులు; 62 బంతుల్లో; 11 ఫోర్లు, 16 సిక్సులు) పరుగుల వరద పారించాడు. పరుగుల వరద అంటే మాములుగా కాదు.. మొత్తం 162 పరుగులో బౌండరీల ద్వారా వచ్చిన పరుగులు 140 అంటే అర్ధం చేసుకోవచ్చు ఏపాటి సునామి సృష్టించాడో. హజ్రతుల్లా ఇన్నింగ్స్‌తో అఫ్గానిస్థాన్ 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లోనే కాదు, అన్ని టీ20 మ్యాచుల్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ఆఫ్గానిస్థాన్ నిలిచింది.

హజ్రతుల్లా వ్యక్తిగత రికార్డులు:

#  అంతర్జాతీయ టీ20ల్లో ఆసీస్ ప్లేయర్ ఆరోన్ ఫించ్ తర్వాత 150కి పైగా పరుగులు చేసాడు. 
# ఉస్మాన్ ఘని (73)తో కలిసి 236 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇది అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యధిక భాగస్వామ్యం. 
# అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 
# 42 బంతుల్లోనే సెంచరీ చేసి అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.