ఆఫ్గాన్‌ విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

ఆఫ్గాన్‌ విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

డెహ్రాడూన్ లోని రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన చివరి టీ-20 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆఫ్గానిస్తాన్ జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఆఫ్గానిస్తాన్ ఓపెనర్లు షహ్‌జాద్(26), గని(19) మంచి ఆరంభం ఇచ్చారు. షహ్‌జాద్ అవుట్ అయిన తర్వాత అస్గర్(27) ధాటిగా ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. గని, అస్గర్ పెవిలియన్ చేరడంతో షెన్‌వారీ(33) ఒంటరి పోరాటం చేసాడు. చివరలో జద్రాన్(15) పరుగులు చేయడంతో 145 పరుగుల సాధారణ పరుగులు చేసింది ఆఫ్గాన్‌.

అనంతరం 146 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఆటగాళ్లని ఆఫ్గాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో కట్టడి చేశారు. 53 పరుగులకే దాస్(12), ఇక్బాల్(5), సర్కార్(15) షకీబ్(10) నాలుగు కీలక వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ని కష్టాల్లో పడేశారు. ఈ దశలో మహ్మదుల్లా(45), రహీమ్‌(46)ల జోడీ జట్టుకు అండగా నిలిచింది. నాలుగో వికెట్‌కి ఏకంగా 84 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును విజయం దిశగా నడిపించారు. చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆఫ్గాన్‌ బౌలర్ రషీద్ ఖాన్ కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆఫ్గానిస్తాన్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌ను ఆఫ్గానిస్తాన్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. 'ప్లేయర్ అఫ్ ది మ్యాచ్' రహీంకు దక్కింది. 'ప్లేయర్ అఫ్ ది సిరీస్' రషీద్ ఖాన్ కు దక్కింది.