బంగ్లాపై అఫ్గాన్ ఘన విజయం

బంగ్లాపై అఫ్గాన్ ఘన విజయం

డెహ్రాడూన్ లోని రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనమిది వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్ దాస్(1) త్వరగానే పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ ఇక్బాల్(43) షబ్బీర్ రెహమాన్(13)తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. రెహ్మాన్ నబీకి చిక్కడంతో 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రహీమ్(22) ధాటిగా ఆడడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో.. కష్టాల్లో పడింది బంగ్లా. చివరలో రోనీ(21)ధాటిగా ఆడడంతో.. బంగ్లా జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసింది.

అనంతరం 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్‌ ఆటగాళ్లని బంగ్లా బౌలర్లు ఇబ్బందులకు గురిచేశారు. ఓపెనర్లు షెహజాద్(24), గని(21) శుభారంభం ఇచ్చారు. వీరి నిష్క్రమణ తర్వాత ఆఫ్గానిస్తాన్ జట్టు 79 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడంది. ఈ దశలో షెన్‌వారీ(49) అద్భుతంగా ఆడి జట్టుని రేసులో నిలిపాడు. అనంతరం 18వ ఓవర్లో షెన్‌వారీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే చివరి 12 బంతుల్లో 20 పరుగులు కావాల్సి ఉండగా.. నబీ ఒకే ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సులు బాది జట్టుకి విజయాన్ని అందించాడు. తాజా విజయంతో ఆఫ్గానిస్తాన్ సిరీస్‌ని కైవసం చేసుకుంది. నాలుగు వికెట్లు తీసిన అఫ్గానిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్‌కు 'మ్యాచ్  ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' దక్కింది.

Photo: FileShot