లోక్ సభలో ట్రిపుల్ తలాఖ్ బిల్లు

లోక్ సభలో ట్రిపుల్ తలాఖ్ బిల్లు

ఇన్ స్టెంట్ ట్రిపుల్ తలాఖ్ ను చట్టవిరుద్ధంగా ప్రకటించేందుకు పోయినసారి రాజ్యసభలో ఆమోదం పొందలేక గడువు ముగిసిన బిల్లుని శుక్రవారం ప్రభుత్వం మరోసారి కొత్తగా లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రవేశపెట్టేందుకు 186 మంది సభ్యులు మద్దతివ్వగా 74 మంది వ్యతిరేకించారు. ముస్లిం మహిళల(వైవాహిక అధికార సంరక్షణ) బిల్లు, 2019ని ఫిబ్రవరిలో బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ సర్కారు జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో తెచ్చారు. బిల్లు గతంలో రాజ్యసభలో ఆమోదముద్ర పొందలేకపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకి చెందిన ఆరుగురు ఎంపీల్లో నలుగురు గురువారం బీజేపీలో చేరడంతో పార్లమెంట్ ఎగువ సభలో ఎన్డీఏ సంఖ్య కొంత పెరిగింది. ఇప్పుడు రాజ్యసభలో మొత్తం 245 మందికి గాను 102 మంది సంఖ్యాబలం ఎన్డీఏకి ఉంది. 

కొత్తగా లోక్ సభలో ట్రిపుట్ తలాఖ్ బిల్లు ప్రవేశపెట్టగానే ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనేనని వాదించారు. అయితే లింగ సమానత్వం, న్యాయం కోసం ఇది చట్టం కావడం తప్పనిసరని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమర్థించుకున్నారు. ఇది ఒక మతానికి సంబంధించిన ప్రశ్న కాదని, మహిళలకు న్యాయం చేయడమే దీని ఉద్దేశమని ప్రసాద్ అన్నారు. దేశంలో 543 ట్రిపుల్ తలాఖ్ కేసులు నమోదయ్యాయని, ట్రిపుల్ తలాఖ్ ని నిషేధిస్తూ సుప్రీంకోర్ట్ తీర్పు ఇచ్చిన తర్వాత 200కి పైగా కేసులు వచ్చాయని తెలిపారు. ఇది మహిళల గౌరవానికి సంబంధించిన ప్రశ్న అని, దానిని పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.