2015 స్థాయి దిశగా ముడిచమురు దిగుమతి బిల్లు

2015 స్థాయి దిశగా ముడిచమురు దిగుమతి బిల్లు

మళ్లీ ముడిచమురు దిగుమతుల బిల్లు మంట పుట్టించే స్థాయికి చేరుతోంది. మూడేళ్ల తర్వాత భారత్ ముడిచమురు దిగుమతుల బిల్లు 2015 ఆర్థిక సంవత్సరం స్థాయికి చేరుకుంటోంది. 2018 ఆర్థిక సంవత్సరంలో 88 బిలియన్ డాలర్లుగా ఉన్న క్రూడాయిల్ దిగుమతుల బిల్లు 2019 ఆర్థిక సంవత్సరంలో 27% పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ముడిచమురు దిగుమతుల బిల్లు 112 బిలియన్ డాలర్లు అవుతుంది. రూపాయి బలహీన పడటం, అక్టోబర్-నవంబర్ 2018లో చమురు ధరలు పెరిగిన కారణంగా దిగుమతుల బిల్లు ఎక్కువైనట్టు చెబుతున్నారు.

అక్టోబర్ 3, 2018న బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 86.29 డాలర్ల స్థాయికి చేరుకొంది.  2015 ఆర్థిక సంవత్సరంలో భారత్ క్రూడాయిల్ దిగుమతి కోసం 112 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముడిచమురు దిగుమతులు 230 మిలియన్ టన్నులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 220 మిలియన్ టన్నులుగా ఉంది. ఈ ఐదేళ్లలో ముడిచమురు దిగుమతి పరిమాణం 22% పెరిగింది. 2019 ఆర్థిక సంవత్సరం గత 10 నెలల్లో క్రూడ్ ఇంపోర్ట్ బిల్లు 95 బిలియన్ డాలర్లుగా ఉంది. 

2019 ఆర్థిక సంవత్సరంలో సగటు బ్యారెల్ క్రూడాయిల్ ధర 10% తక్కువగా 75 డాలర్ల దగ్గర ఉంది. 2015 ఆర్థిక సంవత్సరంలో సగటు బ్యారెల్ ముడిచమురు ధర 84 డాలర్లు. గత ఐదేళ్లలో రూపాయి 19% క్షీణించి డాలర్ కు రూ.58.86 నుంచి రూ.70.13కి చేరుకుంది. క్రూడ్ ధరలు తక్కువగా ఉండటంతో ఎన్డీఏ ప్రభుత్వం ఎక్సైజ్ పన్ను పెంచుతూ పోయి ఖజానాను నింపుకుంది. ఐదేళ్లలో ఎక్సైజ్ డ్యూటీ 12 సార్లు పెంచితే 3 సార్లు మాత్రమే తగ్గించారు.