ప్రియాంకకు వ్యతిరేకంగా అమేథీ, రాయ్ బరేలీలలో పోస్టర్లు

ప్రియాంకకు వ్యతిరేకంగా అమేథీ, రాయ్ బరేలీలలో పోస్టర్లు

ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అమేథీ తర్వాత ఇవాళ ఆమె తన తల్లి, యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్ బరేలీలో పర్యటించారు. రెండు చోట్లా ఆమెకు వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనమిచ్చాయి.

రాయ్ బరేలీ కాంగ్రెస్ కార్యాలయం 'తిలక్ భవన్' బయట సోనియా, ప్రియాంక గాంధీల ఫోటోతో పోస్టర్ అతికించారు. అందులో ప్రియాంక, ఆమె తల్లి ఎన్నికల సమయంలో ఆలయాలు సందర్శిస్తూ కనిపిస్తారు కానీ ఏదైనా సంక్షోభం ఏర్పడినపుడు నగరంలో ఎప్పుడూ కనిపించరని పేర్కొన్నారు. 'మాకు సేవ చేసేందుకు ఓట్లు వేశాం. కానీ సోనియా-ప్రియాంక మాకు అసంతృప్తినే మిగిల్చారు' అని ఆ పోస్టర్ లో రాసి ఉంది.

నిన్న అమేథీలో ప్రియాంక పర్యటించిన సందర్భంగా గోడలపై ఆమె స్కెచ్ తో పోస్టర్లు అతికించారు. 'క్యా ఖూబ్ ఠగ్తీ హో, క్యో పాంచ్ సాల్ బాద్ హీ అమేథీ మే దిఖ్తీ హో (ఎంత బాగా మోసం చేస్తావు, ఐదేళ్ల తర్వాతే ఎందుకు అమేథీలో కనిపిస్తావు)' అని ఒక పోస్టర్ లో కనిపించింది. 

'మే 2014 మే బహుత్ కియా థా వాదా, పాంచ్ సాల్ బాద్ క్యా లేకే ఆయీ హో ఫిర్ అమేథీ కో ఛల్నే కా ఇరాదా (మే 2014లో చాలా వాగ్దానాలే చేశావు, ఐదేళ్ల తర్వాత ఏం తీసుకొని వచ్చావు? మళ్లీ అమేథీని మోసం చేయాలనే ఉద్దేశంతోనా?)' అని మరో పోస్టర్ లో ఉంది.

ఇంకో పోస్టర్ లో ఆమె ఓటర్లను ఆకర్షించేందుకే చీరెలు కట్టుకొని తిరుగుతోందని విమర్శించారు.