అగ్రి వ్యర్థాలతో సంపద సృష్టి ఎలా..? 

అగ్రి వ్యర్థాలతో సంపద సృష్టి ఎలా..? 

వ్యవసాయ వ్యర్థాల నుంచి సంపద సృష్టించవచ్చు అంటున్నారు  తమిళనాడు వ్యవసాయ విద్యాలయం అనుబంధంగా ఉన్న జేఎస్ఏ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ టెక్నాలజీలో  ఫైనలియర్ చదువుతున్న తెలుగు విద్యార్థి పాపినేని వెంకట నిరోష్. వ్యవసాయ రంగంలో పరిశోధనలు ప్రోత్సహించేందుకు విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో తెలుగు ఆ తెలుగు విద్యార్థికి జాతీయ పురస్కారం దక్కింది. మహత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ అయిన మేనేజ్ .... వ్యవసాయ వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం ఎలా అనే అంశంపై వ్యాస రచన పోటీ నిర్వహించింది. అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో నిరోష్ కు ప్రథమస్థానం దక్కింది. 

సాగుభూమి విస్తీర్ణం తగ్గుతూ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో వ్యవసాయ రంగ నిపుణులకు కనువిప్పు కలిగించేలా నిరోష్ చేసిన ప్రయత్నానికి ఈ అవార్డ్ లభించింది. వాస్తవానికి ఢిల్లీలో నానాటికి పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో వ్యవసాయ పరిశోధకులు, ప్రభుత్వాలు వ్యవసాయం వ్యర్థాలపై దృష్టి సారించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో దేశ రాజధానిని ఉక్కిబిక్కిరి చేసే పొగలో 24 శాతం కాలుష్యం ఎండుగడ్డిని తగులబెట్టడం వల్లనేనని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ కు గుర్తించింది. అందుకు సంయుక్తంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. 

పంటల దుబ్బును తగుల బెట్టకుండా ధ్వంసం చేసే యంత్రాల కొనుగోలు కోసం రూ.1,150 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రమంలోనే వ్యవసాయం వ్యర్థాలను తగులబెట్టకుండా వాటి ద్వారా గృహోపకరణ వస్తువులను తాయారు చేసుకోవడం, బయో ఇథనాల్ ప్రోడక్ట్స్ తయారీ, వర్మీ కంపోస్ట్, చెత్తను బయో గ్యాస్ కు వాడడం, వంటి ఆలోచనలను నిరోష్ తన వ్యాసంలో పొందుపరిచారు. దీంతో కాలుష్యాన్ని నియంత్రిచడంతో పాటు ఆయా రాష్ట్రాల రైతులు ఆదాయాన్ని పొందవచ్చు అని నిరోష్ రాసిన వ్యాసం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది.