గుంటూరులో అగ్రి బాధితుల 24 గంటల దీక్ష 

గుంటూరులో అగ్రి బాధితుల 24 గంటల దీక్ష 

అగ్రిగోల్డ్ బాధితులు 24 గంటలపాటు న్యాయ పోరాటం దీక్షను చేపట్టారు. బాధితులు తమ పోరాటాన్ని తీవ్రతరం చేయడంలో భాగంగా.. ప్రభుత్వంపై వత్తిడి తేవడం కోసం న్యాయ పోరాట దీక్షను ప్రారంభించారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఆవరణలో దాదాపు రెండు వేల మంది బాధితులు ఈరోజు న్యాయ పోరాట దీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల నుంచి.. అగ్రిగోల్డ్ ఏజెంట్లు, ఖాతాదారులు తరలివచ్చి ఈ పోరాట దీక్షలో పాల్గొన్నారు. 

ఈరోజు ఉదయం 8గంటల నుండి రేపు ఉదయం 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. ఆ తర్వాత వీరంతా కలిసి ఆత్మఘోష యాత్ర పేరుతో గుంటూరు నుండి వెలగపూడి సచివాలయం వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈరోజు బాధితులంతా కలిసి తలపెట్టిన ఈ పోరాట దీక్షలో అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు జంగాల అజయ్ కుమార్ పాల్గొన్నారు. వీరికి ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులందరీకీ ప్రభుత్వం న్యాయం చేయాలని చలసాని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణ ఉపశమనంగా రూ.3,900 కోట్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిని పట్టుకోవడానికి ప్రభుత్వానికి మూడేళ్లు పట్టిందని.. కొందరు అధికారులు వారికి తెరవెనుక సహకారం అందిస్తున్నారని చలసాని ఆరోపించారు. తమ శాంతి పోరాటానికి పోలీసులు ఎలాంటి అవాంతరాలు కల్పించవద్దని అజయ్ కుమార్ వివరించారు.