17 ఓబీసీ కులాలను ఎస్సీల్లో చేర్చిన యోగి సర్కార్!

17 ఓబీసీ కులాలను ఎస్సీల్లో చేర్చిన యోగి సర్కార్!

ఉత్తరప్రదేశ్ లో సామాజికంగా దళితులతో సమానంగా భావించే 17 అత్యంత వెనుకబడిన కులాలను షెడ్యూల్డ్ కులాల్లో చేర్చాలనే డిమాండ్ కొన్ని దశాబ్దాలుగా ఉంది. తరచూ ప్రభుత్వాలు కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేశాయి. కానీ అవకాశం రాగానే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వీరిని కూడా తనవైపు చేర్చేసుకుంది. ఇప్పుడు మిగతా దళిత జాతులతో పాటు 17 అత్యంత వెనుకబడిన కులాలైన కహార్, కేవట్, మల్లాలు, నిషాద్, కుమ్హార్, కశ్యప్, బింద్, ప్రజాపతి, ధీవర్, భర్, రాజ్ భర్, ఢీమర్, బాథమ్, తుర్హా , మాంఝీ, మఛువా, గోడియాలు షెడ్యూల్డ్ కులాల సర్టిఫికేట్ పొందగలుగుతారు.

షెడ్యూల్డ్ కులాల కోటాలో 17 అత్యంత వెనుకబడిన కులాలను చేర్చాలన్న ఆలోచన నిజానికి ములాయం సింగ్ యాదవ్ ది. కానీ ఆయన ప్రతిపాదన చాలా కాలంగా కోల్డ్ స్టోరేజ్ లో ఉంది. ఈ 17 అత్యంత వెనుకబడిన కులాల జనాభా మొత్తం జనాభాలో దాదాపు 14 శాతం ఉంటుంది. అంటే ఇది ఒక అతిపెద్ద ఓటు బ్యాంకు. గత ఎన్నికల్లో వీళ్లంతా ఒక్కతాటిపై బీజేపీకి ఓటేశారు. అత్యంత వెనుకబడటం కారణంగా వీళ్లు అటు వెనుకబడిన కులాల ప్రయోజనాలు, ఇటు దళితుల ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఇప్పుడు వీళ్లని షెడ్యూల్డ్ కులాల్లో చేర్చడంతో వీరికి లాభం చేకూరనుంది.

షెడ్యూల్డ్ కులాల్లో చేర్చాలన్న ఆందోళన గత కొన్నేళ్లుగా సాగుతోంది. ములాయం సింగ్ మాత్రమే కాకుండా మాయావతి కూడా తన హయాంలో వీరిని షెడ్యూల్డ్ కులాల్లో చేర్చే ప్రయత్నం చేశారు. చివరగా అఖిలేష్ యాదవ్ కూడా ప్రయత్నించారు. వీళ్లంతా ఈ కులాలను షెడ్యూల్డ్ కులాల్లో చేర్చే ప్రతిపాదనకు ఆమోదం పొందగలిగారు కానీ కోర్టు నో చెప్పడంతో ఇది ఆగిపోయింది. ఇప్పుడు యోగి ప్రభుత్వ అదృష్టమో లేక ప్రభుత్వ అంతర్గత ప్రయత్నాల ఫలితమో కానీ కోర్టు ఈ ప్రతిపాదనపై ఇచ్చిన స్టేను తొలగించింది. దీంతో ఈ 17 కులాలకు షెడ్యూల్డ్ కులాల సర్టిఫికేట్ పొందే మార్గం సుగమమైంది. ఈ చర్యతో బీజేపీ, ఓంప్రకాష్ రాజ్ భర్ పార్టీ అజెండాను కూడా లాగేసుకున్నట్టయింది. నిషాద్ పార్టీ, సుహెల్దేవ్ రాజ్ భర్ పార్టీలకు రాజకీయాలు చేయడం ఇకపై కష్టంగా మారనుంది. 

యోగి సర్కారుకి ఇది పెద్ద రాజకీయ విజయం కానుంది. 12 సీట్లలో జరగబోయే ఉప ఎన్నికల్లో యోగి ప్రభుత్వం దీనిని తన ఎజెండాగా ఉపయోగించడం ఖాయం. ఈ 17 అత్యంత వెనుకబడిన కులాల ద్వారా బీజేపీకి రాజకీయ ప్రయోజనం ఉంటుంది కానీ దళితుల్లో ఉన్న కులాలు దీనిని వ్యతిరేకించే ప్రమాదం పొంచి ఉంది.