ఏపీ భవన్‌కు రాహుల్ గాంధీ..

ఏపీ భవన్‌కు రాహుల్ గాంధీ..

ఢిల్లీలోని ఏపీ భవన్‌కు వెళ్లారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఆయనకు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కంభంపాటి రామ్మోహన్‌రావు స్వాగతం పలికారు. రాహుల్ వెంట కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు యువ నేతలు కూడా ఉన్నారు. ఏపీ భవన్‌లోని వీఐపీ క్యాంటిన్‌లో అపనీ బాత్ రాహుల్ కే సాత్ కార్యక్రమం నిర్వహించారు. ఏడుగురు చిన్న మధ్యతరహా పారిశ్రామిక రంగాల వ్యాపారవేత్తలతో రాహుల్ భేటీ అయ్యారు. మొబైల్, చేనేత, ఆటో మొబైల్, సానిటరీ పాడ్స్, టూరిజం, హోటల్, సోలార్ ఏసీ, ఇకో సిల్క్ రంగాల చిన్న తరహా పారిశ్రామికవేత్తలతో రాహుల్ భేటీ  సాగింది. రంగాల వారీగా పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను, సూచనలను తెలుసుకున్నారు కాంగ్రెస్ చీఫ్. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ సాగింది. ఆంధ్ర భోజనం చేస్తూ వ్యాపారుల నుంచి రంగాల వారీగా ఉన్న సమస్యలు, పరిష్కారాలు, సలహాలను తెలుసుకున్నారు రాహుల్. 2019 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరపున తీసుకోవాల్సిన విధానాలు, మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై రంగాల వారీగా ప్రజలతో భేటీ అవుతూ వస్తున్నారాయన. ఇప్పటికే విద్యార్థులతో సమావేశమై విద్యా రంగానికి సంబంధించిన అంశాలు, రిజర్వేషన్లు, విద్యాప్రమాణాలపై సలాహాలు, విద్యార్థుల అభిప్రాయాలు సేకరించిన సంగతి తెలిసిందే.