ఎయిర్ ఇండియాకు బెదిరింపు కాల్ 

ఎయిర్ ఇండియాకు బెదిరింపు కాల్ 

పుల్వామా ఘటన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమానాశ్రయాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. అయినా... ముంబైలోని ఎయిరిండియా కంట్రోల్‌ సెంటర్‌కు ఇవాళ ఓ బెదిరింపు ఫోన్ వచ్చింది. దీంతో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అప్రమత్తమైంది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి, పాకిస్థాన్‌కు తీసుకెళ్ళబోతున్నట్లు ముంబైలోని ఎయిరిండియా ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్‌లోని డ్యూటీ ఆఫీస్‌కు ఫోన్ వచ్చిందని బీసీఏఎస్ తెలిపింది. దీంతో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని ఎయిర్‌లైన్స్, సీఐఎస్ఎఫ్‌లను ఆదేశించింది. బీసీఏఎస్ విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను తెలిపింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ యూనిట్, ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్, అన్ని విమానాల ఆపరేటర్లు వెంటనే అమలు చేయవలసిన చర్యలను వివరించింది. ప్రయాణికులను మరింత కట్టుదిట్టంగా తనిఖీ చేయాలని తెలిపింది. కార్గో టెర్మినల్, కేటరింగ్ వంటి చోట్ల కూడా అణువణువు సోదా చేయాలని పేర్కొంది.