జియో సరే.. చార్జీలపై మిగతా టెలికం సంస్థల మాటేంటి..!?

జియో సరే.. చార్జీలపై మిగతా టెలికం సంస్థల మాటేంటి..!?

టెలికం రంగంలో అడుగు పెడుతూనే సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. తాజాగా, ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ)పేరుతో చార్జీలు వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. జియో నెట్‌వర్క్ మినహా మిగతా నెట్‌వర్క్‌లకు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తారు. ఇది ఇవాళ్టి నుంచే అమల్లోకి తెచ్చింది జియో. అయితే, అక్టోబర్ 9 లేదా అంతకంటే ముందే రీచార్జ్ చేసుకున్నవారు ఈ ఐయూసీ చెల్లించాల్సిన అవసరం లేదు.. ప్రస్తుత ప్లాన్ ముగిసే వరకూ ఉచితంగానే కాల్స్ చేసుకోవచ్చిని జియో క్లారిటీ ఇచ్చింది. ఇదే సమయంలో మిగతా టెలికం సంస్థల మాటేంటి అనే చర్చ మొదలైంది. జియో ఎఫెక్ట్‌తో అంతా టారీఫ్‌లు మార్చి.. డేటా, ఉచిత వాయిస్ కాల్స్ ఇచ్చే పరిస్థితి నెలకొంది. దీంతో.. ఐయూసీ ఛార్జీలను కూడా అన్నీ వడ్డిస్తాయా? అనే భయం వినియోగదారుల్లో నెలకొన్న సమయంలో.. క్లారిటీ ఇచ్చేసింది వొడాఫోన్ ఐడియా లిమిటెడ్. 

ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేసే కస్టమర్లు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. తాము ఐయూసీ చార్జీలను వేయమని స్పష్టం చేసింది వొడాఫోన్ ఐడియా.. ఐయూసీ చార్జీలు మొబైల్ కంపెనీలు తమలో తాము తేల్చుకోవాల్సిన విషమని, దదీనిపై వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేదంటోంది వొడాఫోన్.. మరోవైపు ఐయూసీ ఛార్జీల పేరుతో ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై జియో రుసుము విధించడంపై ఎయిర్‌టెల్‌ స్పందించింది. నిమిషానికి ఆరుపైసలు విధించడం ద్వారా ఐయూసీ ఛార్జీలను ట్రాయ్‌ తగ్గించాలని జియో ఒత్తిడి చేసినట్లుగా అనిపిస్తోందని తెలిపింది. దీనిపై జియో పేరును ప్రస్తావించకుండా ఎయిర్‌టెల్‌ స్పందించింది. ఐయూసీ ఛార్జీలను పూర్తిగా ట్రాయ్‌ రద్దు చేసేందుకు తమ ప్రత్యర్థి నెట్‌వర్క్‌ నిమిషానికి ఆరు పైసలు అంశాన్ని తెరపైకి తెచ్చిందని స్పష్టం చేసింది. ట్రాయ్‌ కావాలనే ఈ సమస్యను తిరగదోడినట్లు వారు చెప్పారని తెలిపింది. 2017లో ఐయూసీ ఛార్జీలను 14  పైసల నుంచి 6 పైసలకు తగ్గించడంపై ఎయిర్‌టెల్‌ అప్పట్లోనే ఆందోళన వ్యక్తంచేసింది. మొత్తానికి...మొబైల్ నెట్ వర్క్ ల పోటీ తత్వంతో కస్టమర్ల జేబులే ఖాళీ అవుతున్నాయి.