జియో ఫైబర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ భారీ ఆఫర్..!

జియో ఫైబర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ భారీ ఆఫర్..!

టెలికం రంగంలో జియోతో రిలయన్స్ సంచలనం సృష్టించింది.. అన్నీ ఫ్రీ అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టి.. అనంతరం టారిప్ ప్లాన్స్ అమలు చేసినా.. జియోకు క్రమంగా ఆదరణ పెరుగుతూనే వచ్చింది. మరోవైపు టెలికం రంగంలోకి ఇతర సంస్థలకు జియోను ఎదుర్కొని నిలడడం సవాల్‌గా మారింది. దీంతో కొన్ని కనుమరుగైపోగా.. కొన్ని సంస్థలు ఇతర సంస్థలు జోడీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక, ఇప్పుడు జియో గిగాఫైబర్‌తో మరో సంచలనానికి తెరలేపేందుకు సిద్ధమవుతోంది రిలయన్స్.. దీనికి సంబంధించిన ప్లాన్స్ కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే, జియో గిగాఫైబర్‌ దెబ్బకు ఇతర టెలికం కంపెనీలు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

రిలయన్స్ జియో గిగాఫైబర్‌ను ఎదుర్కొనేందుకు ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎయిర్‌టెల్-వి ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ సేవల్లోని మూడు ప్లాన్లతో 200 జీబీ నుంచి 1000 జీబీ వరకు అదనపు డేటా ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ బేసిక్ ప్లాన్ రూ.799గా ఉండగా.. ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ రూ.1099గా ఉంది.. ఇక, ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్ రూ.1599తో ఉన్నాయి. బేసిక్ ప్లాన్‌లో ప్రస్తుతం 40 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ డేటా లభిస్తుండగా.. తాజా ప్రకటన ప్రకారం దీనికి అదనంగా 200 జీబీ డేటాను ఆరు నెలల కాలపరిమితితో అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ రూ.1099లో ఇప్పుడు 100 ఎంబీపీఎస్ వేగంతో 300 జీబీ డేటా అందిస్తుండగా.. దీనికి అదనంగా 500 జీబీ డేటాను 6 నెలల కాలపరిమితితో వాడుకోవచ్చు. మూడో ప్లాన్ అయిన ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్ రూ.1599లో ప్రస్తుతం 300 ఎంబీపీఎస్ వేగంతో 600 జీబీ డేటా ఇస్తుండగా... దీనికి అదనంగా 1000 జీబీ బోనస్ డేటా లభిస్తుంది. ఇది కూడా 6 నెల కాలపరిమితితో అందించనుంది. వీటితో పాటు వాయిస్ కాల్స్, ‘ఎయిర్‌టెల్ థ్యాంక్స్’, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది ఎయిర్‌టెల్. ఇక, ఎయిర్‌టెల్ ఆండ్రాయిడ్ సెట్-టాప్-బాక్స్, రిలయన్స్ జియో ఫైబర్‌ను ఎదుర్కోవడానికి ఉచిత టీవీని అందించనున్నట్టు తెలుస్తోంది. రిలయన్స్ జియో యొక్క ఎఫ్‌టిటిహెచ్ సర్వీస్ జియోఫైబర్ సెప్టెంబర్ 5న విడుదల కానున్న సంగతి తెలిసిందే.