మోడీపై సంచలన వ్యాఖ్యలు..!

మోడీపై సంచలన వ్యాఖ్యలు..!

ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు న్యాయవాది, మోడీ పాత స్నేహితుడు అజయ్ అగ్రవాల్... ఈ సారి లోక్‌సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే బీజేపీకి 40 సీట్లు కూడా రావని ఆయన వ్యాఖ్యానించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీలో సోనియాగాంధీపై పోటీ చేసిన ఆయనకు ఈసారి టికెట్ నిరాకరించింది బీజేపీ. దీనిపై ఆగ్రహించిన అజయ్ అగ్రవాల్... ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సమంలో మణిశంకర్‌ అయ్యర్‌ నివాసంలో పాకిస్థాన్‌ అధికారులతో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమావేశమైన విషయాన్ని తానే వెల్లడించానన్నారు. ఈ విషయాన్ని గుజరాత్ ఎన్నికల్లో మోడీ విస్తృతంగా వాడుకున్నారని గుర్తుచేశారు. ఇక ఇదే సందర్భంగా  స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే బీజేపీకి 40 సీట్లు కూడా రావని లేఖలో పేర్కొన్నారు అజయ్ అగ్రవాల్.. తనకు మోడీ 28 ఏళ్లుగా తెలుసని, ఇద్దరం కలిసి బీజేపీ హెడ్‌ క్వార్టర్స్‌లో ఎన్నోసార్లు భోజనం చేశామన్నారు. గత ఎన్నికల్లో సోనియా గాంధీపై పోటీ చేసి 1.73 లక్షల ఓట్లు సాధించానని.. ఇప్పటి వరకు ఇది ఎవ్వరికీ సాధ్యంకాలేదని పేర్కొన్నారు. మరోవైపు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం సీనియర్ నేత ఎల్‌కే అద్వాణీకి రాష్ట్ర  పదవి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న దందాను తాను వెలుగులోకి తెస్తే మెచ్చుకోవాల్సింది పోయి తనపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇప్పుడు అజయ్ అగ్రవాల్ రాసిన బహిరంగ లేఖ చర్చనీయాంశంగా మారింది.