'అలీబాబా'లో ఆసక్తికర పరిణామం

'అలీబాబా'లో ఆసక్తికర పరిణామం

ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు, జాక్‌ మా తన చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ముందుగా చెప్పినట్లుగానే తన 55వ పుట్టినరోజున ఆయన రిటైర్మెంట్‌ తీసుకున్నారు. అయితే ఛైర్మన్‌ పదవిని వీడినప్పటికీ 'అలీబాబా పార్ట్‌నర్‌షిప్‌' గ్రూప్‌లో సభ్యుడిగా కొనసాగనున్నారు జాక్‌ మా. కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో మెజార్టీ సభ్యులను నామినేట్‌ చేసే హక్కు ఈ గ్రూప్‌కు ఉంటుంది. నిజానికి జాక్‌ మా తన రిటైర్మెంట్‌ గురించి ఏడాది క్రితమే ప్రకటించారు. సెప్టెంబరు 10, 2018న తన 54వ పుట్టినరోజున పదవీ విరమణ చేస్తానని వెల్లడించారు. అయితే సంస్థ అవసరాల రీత్యా మరో ఏడాది పాటు ఛైర్మన్‌గా కొనసాగాలని కంపెనీ కోరడంతో ఇప్పటి వరకు ఆయన తన పదవిలో ఉన్నారు. 

ఇంగ్లిష్ టీచర్‌ అయిన జాక్‌ మా 1999లో ఇ-కామర్స్‌ రంగంలోకి అడుగుపెట్టి అలీబాబాను స్థాపించారు. తక్కువ కాలంలోనే ఈ సంస్థ వేగంగా అభివృద్ధి చెంది బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. 2013లో సీఈవో పదవి నుంచి జాక్‌ మా తప్పుకున్నారు. ఆ తర్వాత నుంచి ఛైర్మన్‌గా కొనసాగిన ఆయన ఇప్పుడు ఆ హోదా నుంచి కూడా వైదొలిగారు. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన జాక్‌ మా సంపద ప్రస్తుతం 41.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది.