'అలీబాబా'ను వదలని డ్రాగన్ కంట్రీ.. రికార్డుస్థాయిలో జరిమానా..

'అలీబాబా'ను వదలని డ్రాగన్ కంట్రీ.. రికార్డుస్థాయిలో జరిమానా..

డ్రాగన్ కంట్రీ ఏదైనా అనుకుందంటే చాలు.. అంతు చూసేవరకు వదలదు.. ఇక, ఈ మధ్య అలీబాబా గ్రూప్‌ సంస్థల అధిపతి, అపరకుబేరుడు జాక్‌ మా‌పై చైనా ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని పలు సందర్భాల్లో స్పష్టం అయ్యింది.. తాజాగా.. చైనా యొక్క యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ తన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రత్యర్థులు మరియు వ్యాపారులపై తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిందంటూ అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్‌పై 2.8 బిలియన్ డాలర్ల భారీ జరిమానా విధించింది. చైనాలో ఇదే రికార్డు స్థాయిలో జరిమానాగా చెబుతున్నారు.. అలీబాబా గ్రూప్‌ సంస్థల అధిపతి 37 బిలియన్‌ డాలర్లు విలువచేసే యాంట్‌గ్రూప్‌ ఐపీవోను అడ్డుకోవడం, బ్యాంకింగ్ రెగ్యులేషన్‌ నిబంధనలు అమలు చేయడం వంటి చర్యలతో తన గ్రూప్‌ విలువను అమాంతం తగ్గించారని.. అందుకే ఈ జరిమానా విధించినట్టు ప్రభుత్వం పేర్కొంది.

అయితే, చైనా బ్యాంకింగ్‌ వ్యవస్థలోని లోపాల గురించి అలీబాబా గ్రూప్ సంస్థ అధినేత జాక్ మా.. గత సంవత్సరం కొన్ని వ్యాఖ్యలు చేశారు.. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని ఆయన సూచించారు.. ఇక, అప్పటి నుంచి జాక్‌ మా.. వారికి టార్గెట్‌గా మారిపోయాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో.. కొన్ని రోజుల పాటు అసలు ఆయన ఎక్కడ ఉండోకూడా తెలియని పరిస్థితి వచ్చింది.. చైనా ఆయనను ఏం చేసింది? అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.. ఆ తర్వాత కొద్ది వారాల తర్వాత వర్చువల్‌గా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రత్యక్షం కావడంతో.. ఆ ఊహాగానాలకు పులిస్టాప్ పడింది.. ఇప్పుడు ఆయన సంస్థకు భారీ జరిమానా విధించడంతో మరో సారి వార్తల్లో నిలిచాడాయన.. తాజాగా విధించిన 18.2 బిలియన్ యువాన్ జరిమానా.. ఆ సంస్థ యొక్క దేశీయ వార్షిక అమ్మకాలలో 4 శాతానికి సమానంగా చెబుతున్నారు.. అయితే, చైనీస్ నిబంధనల ప్రకారం, సంస్థ యొక్క వార్షిక అమ్మకాలలో 10శాతం యాంటీట్రస్ట్ జరిమానాలు ఉంటాయని తెలుస్తోంది.