అలీఘడ్ దారుణ ఘటనలో ఇద్దరు అరెస్ట్

అలీఘడ్ దారుణ ఘటనలో ఇద్దరు అరెస్ట్

తండ్రి చేసిన అప్పుతీర్చలేదని కూతురి కళ్లు పీకి, కాళ్లు విరగొట్టి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలీఘడ్‌లో జరిగిన ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెంటనే సిట్ ను ఏర్పాటు చేసింది. సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తవుతోన్న నేపథ్యంలో పోలీసులు నిందితులపై జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే ఐదుగురు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. క్రైం బ్రాంచ్‌ ఎస్పీ, మరో ఎస్పీతో కూడిన సిట్‌ బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తుందని యోగీఆదిత్యనాథ్ సర్కార్ ప్రకటించింది. ఇప్పటికే శాంపిల్స్‌ను ఆగ్రా ఫోరెన్సిక్‌ లాబ్‌కు పంపించారు. కేసు విచారణ కోసం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో జాహీద్, అస్లాం అనే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నిందితుల కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్‌ చేయాల్సిందిగా మృతురాలి తండ్రి డిమాండ్‌ చేస్తున్నాడు. వారికి తెలియకుండా ఈ హత్య జరిగి ఉండదని అతను ఆరోపిస్తున్నాడు. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణాపాయం ఉందని.. వారిని అరెస్ట్‌ చేయకపోతే.. తనను కూడా చంపేస్తారని బాలిక తండ్రి ఆరోపించాడు.

పది వేల రూపాయల అప్పు తీర్చలేదన్న కోపంతో.. రెండున్నరేళ్ల చిన్నారిని పాశవికంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ అలీఘడ్ లో జరిగిన సంగతి తెలిసిందే. అలీఘడ్‌కు చెందిన ఓ వ్యక్తి.. జాహీద్‌ అనే వ్యక్తికి రూ. 50 వేల అప్పు ఇచ్చాడు. రూ.40 వేలు తిరిగి ఇవ్వగా, ఇంకా 10 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. 10 వేల విషయంలో జాహీద్‌కు, అప్పు ఇచ్చిన వ్యక్తికి మధ్య రెండు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జాహీద్‌ తన అనుచరుడు అస్లాంతో కలిసి అప్పు ఇచ్చిన వ్యక్తి కుమార్తె మే 30వ తేదీన కిడ్నాప్‌ చేశాడు. మూడు రోజుల తర్వాత అలీఘడ్‌ శివార్లలో చిన్నారి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యతో సంబంధం ఉన్న జాహీద్‌, అస్లాంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.