కరోనాకు ఆయుర్వేద మందు.. ట్రయల్స్ ప్రారంభం...
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్కు చెక్ పెట్టేందుకు చాలా దేశాలు పరిశోధనల్లో మునిగిపోయాయి... కొన్ని వ్యాక్సిన్లపై ఫోకస్ పెడితే.. మరికొన్ని మందులపై దృష్టిసారించాయి.. ఇప్పటికే కొన్ని ట్రయల్స్ కూడా పూర్తి చేసుకున్నాయి.. భారత్‌లోనూ మూడు వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఇక, తానేం తక్కువ అంటోంది ఆయుర్వేద వైద్యం.. ఆయుర్వేద మందు కూడా ట్రయల్స్ దశకు చేరుకుంది... ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద్(ఏఐఐఏ) తాజాగా నిసార్గ్ హెర్బ్స్ అనే సంస్థతో ఎంవోయూ కుదుర్చుకుంది.. కరోనాపై పోరాటంలో వేప ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ఈ రెండు సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్నాయి.
ఈ వేప మందు పరీక్షలకు హర్యానా ఫరీదాబాద్‌లోని ఈఎస్ఐసీ ఆసుపత్రి వేదికగా మారింది. ఏఐఐఏ డైరెక్టర్ డాక్టర్ తనూజా నేసారి ఈ పరిశోధనలకు సారధ్యం వహిస్తుండగా.. ఈఎస్ఐసీ ఆస్పత్రి డీన్ డాక్టర్ అసీమ్ సేన్‌తోపాటు మరో ఆరుగురు వైద్యుల బృందం ఈ పరిశోధనలో భాగస్వామ్యం అవుతోంది. మొత్తంగా 250 మందిపై వేపమందు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ సంక్రమణను నివారించడంలో వేపమందు ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అనే విషయంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా.. ముందుగా 125 మందికి వేప గుళికలు ఇచ్చి, అవి కరోనాపై పోరాటంలో ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయో పరిశీలిస్తున్నారు. మొత్తంగా ఈ ట్రయల్స్‌ను 28 రోజులపాటు కొనసాగించనున్నారు. అయితే కోవిడ్ నివారణలో తమ వేపమందు సమర్థవంతమైన యాంటీ-వైరల్ ఔషధంగా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు నిసార్గ్ బయోటెక్ వ్యవస్థాపకుడు, సీఈవో గిరీష్ సోమన్. మరి వేప మందు కరోనాకు ఏ స్థాయిలో చెక్ పెడుతుంది అనేది మాత్రం ఆసక్తిగా మారింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)